Best Pension Plan In India : వృద్ధాప్యంలో వ్యక్తుల జీవితానికి ఆర్థిక ఆసరా కల్పించేందుకు 'అటల్ పెన్షన్ యోజన' అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో చేరినట్లయితే మీకు 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో ఎవరి సహాయం అవసరం లేకుండా, కేంద్రం నుంచి వచ్చే ఈ పెన్షన్‌తో మీరు జీవితాన్ని హాయిగా గడపవచ్చు.
చాలా మంది నిరుపేదలు, సామాన్య ప్రజలు పెన్షన్ స్కీమ్‌లలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేరు. ఇలాంటి వారికి కూడా అటల్ పెన్షన్ స్కీమ్ చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే, కేవలం రోజుకు రూ.13 మాత్రమే చెల్లించి ఈ అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. అందుకే ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం 2015-16లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల, అల్పాదాయ వర్గానికి చెందిన ప్రజల కోసం అటల్ పెన్షన్ యోజన(APY) అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరినవారు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నెలకు రూ. 1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీ పెట్టుబడితో పాటు, ప్రభుత్వం కూడా సంవత్సరానికి రూ.1,000 వరకు నిధులను కూడా అందిస్తుంది.
అటల్ పెన్షన్ యోజన అర్హతలు ఏమిటి?
Atal Pension Yojana Eligibility :ప్రభుత్వ నియమాల ప్రకారం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వారు ఈ అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. అందువల్ల 18 సంవత్సరాలు నిండిన, చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ స్కీమ్‌లో చేరి తమ భవిష్యత్తు పదవీవిరమణ జీవితం కోసం పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 40 ఏళ్లు దాటిన తర్వాత ఈ స్కీమ్‌లో చేరేందుకు వీలుండదు. అలాగే దీనిలో చేరేవారు ఏ ఇతర ప్రభుత్వ ప్రాయోజిత సామాజిక భద్రతా పథకాలను కలిగి ఉండకూడదు. అదేవిధంగా పన్ను చెల్లింపుదారుగా కూడా ఉండకూడదు.
ఈ స్కీమ్‌లో ఎలా చేరాలి?
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. అలాగే మీకు దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుబడి పెట్టి ఈ పెన్షన్ పథకంలో చేరవచ్చు. అలాగే ఈ స్కీమ్‌లో చేరిన వారు ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.