Apple Layoffs 2024 : ప్రఖ్యాత టెక్ కంపెనీ యాపిల్ 600కు పైగా ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభం తరువాత యాపిల్ కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి.
యాపిల్-లే ఆఫ్స్
కాలిఫోర్నియాలోని 8 కార్యాలయాల్లో పనిచేస్తున్న మొత్తం 614 మంది ఉద్యోగులను తొలిగిస్తూ మార్చి 28న యాపిల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ తొలగింపులు (లే ఆఫ్స్) మే 27 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇటీవల కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్కు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ తొలగించిన ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ లేదా ఏ ప్రాజెక్ట్‌కు చెందినవారో స్పష్టమైన సమాచారం లేదు.
కారణం అదేనా?
కరోనా సంక్షోభం వచ్చిన కాలంలో టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నాయి. కానీ తరువాత కంపెనీల వృద్ధి మందగించడం, లాభాలు తగ్గడం మొదలైంది. దీనితో ఖర్చులు తగ్గించుకోవడానికి, గత రెండేళ్లుగా తమ దగ్గర అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.
అమెజాన్ కంపెనీ ఈ వారం ప్రారంభంలో తన క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ 'ఏడబ్ల్యూఎస్' నుంచి చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల వీడియో గేమ్స్ మేకింగ్ కంపెనీ 'ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్' సుమారుగా 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. సోనీ కంపెనీ తమ ప్లేస్టేషన్ డివిజన్లోని 900 మంది ఉద్యోగులను, సిస్కో సిస్టమ్స్ 4000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నాయి. అలాగే సోషల్ మీడియా కంపెనీ స్నాప్ (స్నాప్‌చాట్) 10 శాతం మంది ఉద్యోగులను తొలగించునున్నట్లు స్పష్టం చేసింది.