Anant Radhika Wedding : ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ముకేశ్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12న వివాహం బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ వివాహ వేడుకకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. అయితే అనంత్- రాధిక వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అంబానీ ఫ్యామిలీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలోని పేద వర్గాలకు చెందిన యువతీయువకుల కోసం సామూహిక వివాహాలను జరిపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో జులై 2న సాయంత్రం 4 గంటలకు పాల్ఘర్ జిల్లాలోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో ఈ సామూహిక వివాహ వేడుక కార్యక్రమం జరగనుంది.
అతిథుల కోసం బనారసీ చీరలు
ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ కొద్ది రోజుల క్రితం తన కుమారుడి పెళ్లి కార్డును కాశీ విశ్వేశ్వరుడికి సమర్పించి, అక్కడే కొద్దిసేపు గడిపారు. ఆ తర్వాత నీతా అంబానీ లక్క బుటీ బనారసీ చీరలను భారీ స్థాయిలో కొనుగోలు చేశారు. రామ్‌నగర్ జిల్లాలోని విజయ్ మౌర్య ఇంటిని సందర్శించి అక్కడ మరీ కొందరూ బనారసీ కళాకారులను తన హోటల్‌కు ఆహ్వానించారు. వారికి పెద్ద మొత్తంలో బనారసీ చీరలను ఆర్డర్ ఇచ్చారు. ఈ చీరలను అనంత్-రాధిక వివాహ వేడుకకు వచ్చే అతిథులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సంగీత్‌లో అనంత్ లవ్ స్టోరీ
మరోవైపు అనంత్-రాధిక సంగీత్ కార్యక్రమంలో వారి ప్రేమ కథను వర్ణించే నృత్య ప్రదర్శనను చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే సంగీత్ కార్యక్రమంలో అనంత్-రాధిక స్నేహితుల నృత్య ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు సమాచారం, ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.