Anant Ambani Wedding Date :భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో జులై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ వివాహానికి వేదిక కానుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మూడు రోజులపాటు అనంత్-రాధిక పెళ్లి వేడుకలు జరగనున్నాయి.
అనంత్-రాధిక పెళ్లి షెడ్యూల్ ఇదే
- జులై 12(శుక్రవారం)న శుభ వివాహ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి పెళ్లిపీటలపై అనంత్- రాధిక కూర్చోనున్నారు.
- జులై 13( శనివారం)న శుభ్ ఆశీర్వాద్ వేడుక జరగనుంది.
- జులై 14(ఆదివారం)న వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులందరూ ఇండియన్ చిక్ దుస్తులను ధరించనున్నారు.
గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ వేడుకలు
ఈ ఏడాది మార్చిలో గుజరాత్లోని జామ్ నగర్లో ఘనంగా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి వ్యాపారవేత్తలు, దేశాధినేతలు, హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు.