Anant Ambani Radhika Merchant Anna Seva : 'ప్రపంచమంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి' అన్నట్టుగా భారత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఇంట్లో వివాహ వేడుకల హడావుడి మొదలైంది. ముకేశ్, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతుండటం టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయింది. తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
స్వయంగా వడ్డించిన అనంత్, రాధిక
గుజరాత్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు 'అన్న సేవ'తో ప్రారంభమయ్యాయి. ముకేశ్, అనంత్, రాధిక సహా అంబానీ కుటుంబసభ్యులు గ్రామస్థులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని స్వయంగా వడ్డించారు.
51 వేల మందికి విందు
ఈ కార్యక్రమంలో రాధికా మర్చంట్ అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా పాల్గొన్నారు. సుమారు 51 వేల మంది స్థానిక నివాసితులకు ఆహారం వడ్డించారు. ఈ కార్యక్రమం కొద్ది రోజులపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అన్న సేవ అనంతరం సంప్రాదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు స్థానికులు. ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గఢ్వీ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
1000 మంది ప్రముఖులు
అయితే జులైలో అనంత్- రాధిక వివాహం జరగనుండగా, జామ్‌నగర్‌లో మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ వేడుకలను నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు ఉన్నారు.
నో రిపీట్
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తోపాటు అనేక మంది ప్రముఖులు రానున్నారు. వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది అంబానీ కుటుంబం. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట. ఒకసారి వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.