Ambani Adani Collaboration : దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ- గౌతమ్ అదానీ విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 500 మెగావాట్ల కోసం అదానీ పవర్ లిమిటెడ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తద్వారా అదానీ పవర్ ప్రాజెక్ట్‌లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్.
అదానీ పవర్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల్ కోసం కోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రెండు సంస్థలు ఈ విషయాన్ని గురువారం తెలిపాయి
"అదానీ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ (MEL), రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)తో క్యాప్టివ్ యూజర్ పాలసీ కింద 500 మెగా వాట్ల కోసం 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విధానమంతా ఎలక్ట్రిసిటీ రూల్ 2005 కింద జరిగింది" అని అదానీ పవర్ లిమిటెడ్ స్టాక్ ఫైలింగ్‌లో పేర్కొంది.
"విద్యుత్ ఉత్పత్తి, సరఫరా రంగంలో MEL నిమగ్నమై ఉంది. ఆ సంస్థ టర్నోవర్ 2022-23కు రూ. 2,730 కోట్లు, 2021-22కు రూ.1,393.59కోట్లు, 2020-21కు రూ. 692.03 కోట్లుగా ఉంది. MELతో షరతులతో కూడిన పెట్టుబడి ఒప్పందం కుదిరింది. రెండు వారాల్లోపు పూర్తి ప్రక్రియ పూర్తవుతుంది" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ రెగ్యులర్ ఫైలింగ్‌లో తెలిపింది.