Adani Group To Invest USD 100 bn In Energy Transition :ఇంధన పరివర్తన ప్రాజెక్టుల(గ్రీన్ ట్రాన్సిషన్ ప్రాజెక్టులు)పై 100 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,34,180 కోట్లు) మేర పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి అవసరమైన ప్రతి ప్రధాన భాగాన్ని ఉత్పత్తి చేసే యూనిట్లను దేశంలో నిర్మిస్తామని పేర్కొన్నారు.
సూర్యకాంతి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సోలార్ పార్క్‌లను నిర్మించనున్నట్లు గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. అలాగే పవన క్షేత్రాలు నిర్మించి పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు, సౌరఫలకాలను తయారు చేయడానికి ఎలక్ట్రోలైజర్ల అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఎలక్ట్రోలైజర్లను తయారుచేసే మేజర్ ఫెసిలిటీస్ నిర్మిస్తున్నట్లు అదానీ తెలిపారు.
డీకార్బనైజేషన్
స్వచ్ఛమైన శక్తితో నడిచే ఎలక్ట్రోలైజర్లు - నీటి నుంచి హైడ్రోజన్‌ను విడదీసి గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనితో పరిశ్రమలు, రవాణా సాధనాలు డీకార్బనైజ్ అవుతాయి. దీనివల్ల గాలి కాలుష్యం గణనీయంగా తగ్గిపోతుందని గౌతమ్ అదానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
క్రిసిల్ 'ఇన్ఫ్రాస్ట్రక్చర్ - ది క్యాటలిస్ట్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, భారతదేశంలో ఇంధన పరివర్తన ప్రాజెక్టులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి ట్రిలియన్ డాలర్ల మేర ఆదాయాన్ని భారతదేశానికి సమకూరుస్తాయని పేర్కొన్నారు.