తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్ యాక్సిడెంట్ జరిగిందా? డోంట్ వర్రీ- వెంటనే ఈ 10 పనులు చేస్తే అంతా సేఫ్​! - WHAT TO DO AFTER CAR ACCIDENT

కారు ప్రమాదం జరిగిన వెంటనే చేయాల్సిన 10 పనులివే!

What To Do After Car Accident
What To Do After Car Accident (PTI)

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2025, 8:01 AM IST

What To Do After Car Accident :మన దేశంలో ప్రతీ గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతీ నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ప్రపంచ బ్యాంక్ గతంలో విడుదల చేసిన ఓ నివేదికలోని వివరాలు ఇవి. మొత్తం మీద ఇది భారత్‌లోని రోడ్లపై డ్రైవింగ్ అనేది పెద్ద సవాలుతో కూడిన విషయమని స్పష్టం చేసింది. నిత్యం ఎన్నో కార్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఒకవేళ మీ కారు ఇలాంటి ప్రమాదం బారినపడితే వెంటనే చేయాల్సిన 10 విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

  1. కారును ఆపండి :రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, అక్కడే మీ కారును ఆపేయండి. దీనివల్ల మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరార్ కావద్దు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు.
  2. గాయాలపాలైన వారికి సాయం చేయండి :రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందేలా ఏర్పాట్లు చేయండి. అంతకంటే ముందు మీకు అయిన గాయాలను చెక్ చేసుకోండి. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ స్కీమ్​ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి.
  3. వైద్య సాయం పొందండి :రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మీ కారులోని ప్రథమ చికిత్స పెట్టెను వాడుకోండి. గాయపడిన వారికి అందులోని సామగ్రితో ప్రథమ చికిత్స చేయండి. మీకు గాయాలైతే మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. ఇదే సమయంలో తప్పకుండా అంబులెన్సుకు కబురుపెట్టండి. మీ ప్రాథమిక చికిత్స ప్రక్రియ పూర్తయ్యేలోగా అంబులెన్సు వస్తుంది. దానిలో ఆస్పత్రికి చేరుకోవచ్చు.
  4. బీమా కంపెనీకి సమాచారం ఇవ్వండి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ చికిత్స చేయించిన వెంటనే, బీమా కంపెనీకి ఈ ప్రమాదంపై సమాచారాన్ని అందించండి. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకు అయిన గాయాలు, ఇతరులకు అయిన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వంటి వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.
  5. పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి : ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదంటే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీని బీమా కంపెనీ అడుగుతుంది.
  6. ఫొటోలు తీయండి : రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం ఫొటోలన్నీ తీయండి. గాయపడిన వారి ఫొటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావడంలో ఈ ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయి.
  7. డాక్యుమెంట్లు సమర్పించండి : రోడ్డు ప్రమాదం విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేసిన వెంటనే, మీరు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ జాబితాలో డ్రైవింగ్ లైసెన్సు, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, కారు ఆర్‌సీ, కారు బీమా పత్రాలు, రిపేర్ అంచనా నివేదికలు ఉండాలి. ఇవన్నీ ఇచ్చాక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను సెటిల్ చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది.
  8. కారును రిపేర్ చేయించుకోండి :రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారును రిపేర్ చేయించవద్దు. బీమా కంపెనీ ఒక సర్వేయర్‌ను పంపుతుంది. అతడు వచ్చి కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నమోదు చేసుకుంటాడు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను సర్వేయర్ అంచనా వేస్తాడు. ఆ నివేదికను అతడు బీమా కంపెనీకి అందజేస్తాడు. ఈ ప్రాసెస్ ముగిశాక మనం కారుకు మరమ్మతులు చేయించుకోవచ్చు. కారును మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లే సౌకర్యాన్ని సైతం బీమా కంపెనీ కల్పిస్తుంది. ఆ బీమా కంపెనీ పరిధిలో లేని మెకానిక్ వద్ద కూడా కారును రిపేర్ చేయించుకోవచ్చు. మెకానిక్ నుంచి పొందిన బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించి, రీయింబర్స్‌మెంట్‌ను పొందవచ్చు.
  9. కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ : బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో కొన్ని కార్ గ్యారేజీలు ఉంటాయి. వాటిలో మీరు కారును రిపేర్ చేయించుకుంటే, నేరుగా ఆ గ్యారేజీకే బీమా కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు నెట్‌వర్క్‌లో లేని గ్యారేజీలో కారును రిపేర్ చేయించుకుంటే, మీకు అంత మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.
  10. సదా అప్రమత్తంగా ఉండండి :రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అది అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే మనం నిత్యం అలర్ట్‌గా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, తక్కువ వేగంతో కారును డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో వాహనం నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలన్నీ కారులో సిద్ధంగా ఉంచుకోండి.

ABOUT THE AUTHOR

...view details