Heyansh Yadav Yoga at Maha kumbh :ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే మంగళవారం మహాకుంభమేళాకు ఓ ప్రత్యేక సందర్శకుడు వచ్చాడు. అతడే అతి పిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన హేయాన్ష్ యాదవ్. ఈ యువ సాహసికుడు కుంభమేళాలో వివిధ భంగిమల్లో యోగా చేస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు. ఫిట్‌నెస్‌పై ఉన్న అంకితభావంతో కుంభమేళాలో యోగా చేశాడు.
మూడేళ్ల వయుసులోనే రికార్డ్
హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన హేయాన్ష్ యాదవ్ 2022లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించాడు. అప్పటికి హేయాన్ష్ వయసు కేవలం 3 సంవత్సరాల 7 నెలలే. దీంతో పిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన పర్వతారోహకుడిగా హేయాన్ష్ రికార్డుకెక్కాడు.
అయితే హేయాన్ష్ కుంభమేళాలో యోగా చేయడానికి గల కారణాలు, కెరీర్ గురించి అతడి తండ్రి మంజీత్ కుమార్ తెలిపారు. "హేయాన్ష్ శరీరం ఎత్తైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నకు చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా నా కుమారుడు హేయాన్ష్ రికార్డు సృష్టించాడు. మేము కొండలపైకి వెళ్లేవాళ్లం. అప్పుడు హేయాన్ష్ బాడీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండడం గమనించాం. అందుకే మేము నిపుణులను సంప్రదించి హేయాన్ష్ ను ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను అధిరోహించేందుకు అనుమతించాం. ఇప్పుడు హేయాన్ష్ యోగా చేస్తున్నాడు. " అని మంజీత్ కుమార్ పేర్కొన్నారు.
పోటెత్తిన భక్తులు
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వసంతపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి సోమవారం భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమం హరహర మహాదేవ్ నినాదాలతో మార్మోగిపోయింది. సోమవారం మధ్యాహ్నం నాటికి మహా కుంభమేళాలోని త్రివేణి సంగమం వద్ద 1.25 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారని అధికారులు తెలిపారు.
భద్రత మరింత కట్టుదిట్టం
వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు 'అమృత స్నాన్' కోసం తరలివచ్చిన సాధువులు, అఘోరాలపై యూపీ సర్కార్ పూల వర్షం కురిపించింది. అలాగే భక్తులు, సాధువులు కోసం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. మహాకుంభమేళా ప్రాంతంలో సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మౌంటెడ్ పోలీసులు, మహిళా పోలీసులు, అగ్నిమాపక దళం, పీఏసీ, ఎస్టీఎఫ్, ఏటీఎస్, ఎన్ఎస్ జీ కమాండోలు, పారామిలటరీ బలగాలు, బాంబు నిర్వీర్య స్క్వాడ్ లను మోహరించింది. సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసే భక్తుల భద్రత కోసం వాటర్ పోలీసులు, శిక్షణ పొందిన డైవర్లు, డీప్ డైవర్లును ఉంచింది. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంగం ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిశితంగా గమనిస్తున్నాయి.