Yana Mir Delhi Airport : బ్రిటన్‌లో మలాలా యూసఫ్ జాయ్పై వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ సిబ్బంది విసిగించారని ఆమె ఆరోపించారు. అయితే యానా మీర్ చేసిన ఆరోపణలపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం స్పందించింది. భద్రతా తనిఖీలకు యానా సహకరించలేదని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేసింది. అసలేం జరిగిందంటే?
'ఒక స్మగ్లర్లా చూశారు!'
ఇటీవల లండన్‌లో జరిగిన సంకల్ప్ దివస్ కార్యక్రమంలో డైవర్సిటీ అంబాసిడర్ అవార్డును అందుకున్నారు యానా మీర్. ఆ సందర్భంగా కశ్మీర్‌లో భద్రతపై బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగించి భారతీయుల మనసులను చూరగొన్నారు. ఇటీవల ఆమె భారత్‌కు తిరిగివచ్చారు. ఆ సమయంలో దిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ సిబ్బంది విసిగించారని ఆరోపించారు. విమానాశ్రయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఒక స్మగ్లర్లా చూశారంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
'చెబుతున్న వినిపించుకోకుండా!'
తన వద్ద షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయని, వాటిని ఇంగ్లాండ్‌లో తన బంధువులు ఇచ్చారని చెప్పారు యానా మీర్. అందుకే తన వద్ద రసీదు లేదని తెలిపారు. చెప్పినా వినకుండా తన లగేజీ అంతా ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెరిచారని ఆరోపించారు. దొంగతనం చేసి ఇక్కడికి ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? అని మీర్ ఓ మహిళా అధికారితో అన్నట్లు తెలుస్తోంది. అయితే యానా మీర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది నెటిజన్లు విమానాశ్రయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
'నిబంధనల ప్రకారమే అంతా'
అయితే యానా మీర్ ఆరోపణలపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికుల లగేజ్ తనిఖీ అనేది సాధారణ ప్రక్రియ అని చెప్పింది. ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని పేర్కొంది. బ్యాగ్‌లను స్కాన్ చేసేందుకు యానా మీర్ సహకరించలేదని, ఇంతలో సిబ్బంది స్కానింగ్ మెషీన్లో ఆమె బ్యాగ్ పెట్టారని చెప్పింది. ఆమెతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉన్నారంటూ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేసింది.