తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అందుకే ఆర్టికల్ 370 తొలగించాం- అభివృద్ధి చెందిన దేశంగా భారత్ : మోదీ - NATIONAL UNITY DAY 2024

సర్దార్ వల్లభాయ్ పటేల్ నివాళులర్పించిన ప్రధాని మోదీ- ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడి- అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచిందన్న ప్రధాని

National Unity Day Modi
National Unity Day Modi (ANI)

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 10:22 AM IST

Updated : Oct 31, 2024, 11:25 AM IST

National Unity Day Modi :దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్‌ 370ని తొలగించామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుందని వెల్లడించారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దేశ వికాసానికి దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఏటా ఎన్నికల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతోందని వ్యాఖ్యానించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా విగ్రహం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ క్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

"భారత్​కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే సంకల్పం నెరవేరినందుకు యావత్ దేశం సంతోషంగా ఉంది. ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్​కు దేశ ప్రజలు ఇచ్చే అతిపెద్ద నివాళి. ఒకే దేశం- ఒకే ఎన్నికలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది"
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

'రాజ్యాంగాన్ని చాలాసార్లు అవమానించారు'
గత 70 ఏళ్లుగా బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పేరును జపించే వారు దాన్ని చాలా సార్లు అవమానించారని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చిన 70ఏళ్ల తర్వాత మొదటిసారిగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారని పేర్కొన్నారు. ఈ దృశ్యం భారత రాజ్యాంగ నిర్మాతలకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు.

'అర్బన్ నక్సల్స్ ముసుగును తొలగించాలి'
"'ఒకే దేశం- ఒకే గుర్తింపు' అయిన ఆధార్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అలాగే గతంలో ఉన్న అనేక పన్ను వ్యవస్థలను రద్దు చేసి 'వన్ నేషన్- వన్ ట్యాక్స్ సిస్టమ్' ను తీసుకొచ్చాం. అలాగే విద్యుత్ రంగాన్ని బలోపేతం చేశాం. 'వన్ నేషన్- వన్ హెల్త్ ఇన్సూరెన్స్' సదుపాయాన్ని ప్రవేశపెట్టాం. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం అద్భుతమైన యాదృచ్చికతను తెచ్చిపెట్టింది. దీపావళి పండుగ రోజే ఐక్యతా దినోత్సవం పండగను జరుపుకుంటున్నాం. కులాల ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. దేశ అభివృద్ధి వ్యతిరేకంగా వారు పనిచేస్తున్నారు. నక్సలిజం అడవుల్లో నశించి, అర్బన్​లో పుట్టుకొస్తోంది. అర్బన్ నక్సల్స్​ను గుర్తించి వారి ముసుగును తొలగించాలి" అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

ఆకట్టుకున్న పరేడ్
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున 'జాతీయ ఐక్యతా దినం' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. గుజరాత్​లోని కేవడియాలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పటేల్‌ భారీ విగ్రహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ పరేడ్‌ నిర్వహించారు. ఇందులో సైనిక బలగాలు చేసిన విన్యాసాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సాయుధ దళాలకు ప్రధాని సెల్యూట్
9 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన పోలీసులు, నాలుగు కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఎన్‌సీసీ బృందం ఈ పరేడ్​లో మార్చ్‌ చేశారు. సీఆర్ పీఎఫ్ మహిళ, పురుష సిబ్బంది బైక్​లతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విన్యాసాలను ప్రధాని ప్రత్యక్షంగా వీక్షించి సాయుధ దళాలకు సెల్యూట్‌ చేశారు. అంతకుముందు పటేల్‌ విగ్రహంపై భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ బృందం పూలవర్షం కురిపించింది.

నివాళులర్పించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్​దీప్​ ధన్‌ఖడ్, దిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనా, పలువురు కేంద్ర మంత్రులు పటేల్ చౌక్​లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో సర్దార్ పటేల్ సేవలను గుర్తు చేసుకున్నారు. "దేశ ఏకీకరణకు బాటలు వేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్​కు నివాళులు! సర్దార్ పటేల్ గొప్ప దేశభక్తుడు, దేశ నిర్మాత. ఆయన ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకుని దేశ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా పని చేయాలి." అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ లో పోస్టు చేశారు.

Last Updated : Oct 31, 2024, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details