Wolf Attack In Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లా వాసులను కంటి మీద కునుకులేకుండా చేస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 'ఆపరేషన్ భేడియా'లో భాగంగా తోడేళ్లను పట్టుకునేందుకు పిల్లల(చిన్నారుల) మూత్రంతో తడిపిన రంగురంగుల టెడ్డీ బొమ్మలను ఎరగా వేస్తున్నారు. ఈ బొమ్మలను వ్యూహాత్మకంగా నది ఒడ్డున, తోడేళ్లు విశ్రాంతి తీసుకునే స్థలాలు, గుహలకు దగ్గరగా ఉంచారు. మనుషుల వాసనను తోడేళ్లకు తెలియజేసేందుకు అధికారులు ఈ వినూత్న ప్రయత్నాన్ని చేపట్టారు.
"తోడేళ్లు నిరంతరం తమ స్థావరాలను మారుస్తూ ఉంటాయి. సాధారణంగా అవి రాత్రిపూట వేటాడతాయి. ఉదయానికి తిరిగి వాటి గుహలకు చేరుకుంటాయి. తోడేళ్లను పట్టుకునేందుకు మేము ఒక ప్లాన్ చేశాం. తోడేళ్లను తప్పుదారి పట్టించి, వాటిని గుహల నుంచి బయటకు రప్పిస్తాం. అప్పుడు అక్కడ ఉన్న ఉచ్చులు, బోనులలో అవి చిక్కుకునేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. తోడేళ్లను థర్మల్ డ్రోన్లను ఉపయోగించి ట్రాక్ చేస్తున్నాం. బాణసంచా కాల్చడం, శబ్దం చేయడం ద్వారా వాటిని ఉచ్చుల వైపు మళ్లేటట్లు చేస్తున్నాం. అవి ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుంటాయి. అందుకే, మేము పిల్లల మూత్రంతో తడిపిన రంగురంగుల పెద్ద టెడ్డీ బొమ్మలను వాటికి ఎరగా వేస్తున్నాం. "
-- అజిత్ ప్రతాప్ సింగ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్
తోడేళ్లను చంపాలని చూసిన బ్రిటిషర్లు
తోడేళ్లు, నక్కలు, పెంపుడు కుక్కలు, అడవి కుక్కలు- ఇవన్నీ ఒకే జాతికి చెందినవని సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి రమేశ్ కుమార్ పాండే తెలిపారు. దశాబ్దాల క్రితమే బ్రిటిషర్లు ఈ ప్రాంతం నుంచి తోడేళ్లను నిర్మూలించాలని ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. వాటిని చంపినవారికి బహుమతులు కూడా అందించారని వివరించారు. అయినప్పటికీ, తోడేళ్లు బతికాయని చెప్పుకొచ్చారు. "జంతువులను పట్టుకోవడానికి పలు రకాల ఎరలను ఉపయోగిస్తారు. పక్షుల నుంచి పంటలను రక్షించడానికి పొలాల్లో దిష్టిబొమ్మలను ఎలా ఉపయోగిస్తారో, అదే విధంగా జంతువులను పట్టుకోవడానికి అటవీ శాఖ టెడ్డీ బొమ్మలను ఉపయోగిస్తుంది. ఇటువంటి పద్ధతులు విజయవంతమయ్యాయని రికార్డుల్లో లేదు. అయినప్పటికీ మానవ-వన్యప్రాణుల సంఘర్షణకు పరిష్కారం కనుక్కొవడానికి ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేపట్టాలి." అని తెలిపారు.