Wives Campaign For Husbands in MP : సార్వత్రిక ఎన్నికల సమరం దేశంలో రాజకీయ వేడిని మరింత పెంచింది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమ వారి విజయం కోసం కుటుంబ సభ్యులు ప్రచార బరిలోకి దిగుతున్నారు. మధ్యప్రదేశ్‌లో భర్తల గెలుపు కోసం భార్యలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రాజవంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా భార్య, అపర కుబేరుడు నకుల్‌నాథ్ సతీమణి ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి తమ భర్తల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో తమ భర్తలకు గెలుపు భరోసా కల్పించాలనే తపనతో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుంటూ వారి సతీమణులు ప్రజలతో మమేకమవుతున్నారు. రాజ వంశానికి చెందిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భార్య ప్రియదర్శిని రాజే సింధియా, అత్యంత ధనిక అభ్యర్థుల్లో ఒకరైన కాంగ్రెస్ నాయకుడు నకుల్ నాథ్ భార్య ప్రియా నాథ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తమ భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమ పతులకు విజయాన్ని కట్టబెట్టడం కోసం వ్యాపారులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దైవ కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటున్నారు. సామాన్య ప్రజలను ఆకర్షించే కార్యక్రమాల్లో ప్రియదర్శిని రాజే సింధియా, ప్రియా నాథ్ పాల్గొంటున్నారు. పొలాల్లో పనిచేస్తున్న కూలీల దగ్గరికి వెళ్లి వారితో మాటలు కలిపి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
భర్త గెలుపు కోసమే
ఛింద్వాడాలో సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఈసారి ఎన్నికల అఫిడవిట్‌లో తనకు రూ.697 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 475 మంది లోక్‌సభ అభ్యర్థుల కోటీశ్వరుల జాబితాలో నకుల్‌నాథ్ అగ్రస్థానంలో ఉన్నారు. నకుల్ నాథ్ సతీమణి ప్రియా నాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌరై ప్రాంతంలోని ఓ వ్యవసాయ పొలంలో పంటలు కోస్తూ కనిపించారు. అంతేకాకుండా నవేగావ్ గ్రామంలో భగవత్ కథ చెప్పే మండపం వద్ద ప్రియా నాథ్ భక్తి పాటలకు గ్రామ మహిళలతో కలిసి నృత్యం చేశారు.
వడోదరలోని గైక్వాడ్ రాజకుటుంబానికి చెందిన ప్రియదర్శిని రాజే సింధియా తన భర్త జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్న గుణ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ, మార్కెట్ ప్రదేశాల్లో ఓటర్లను కలుసుకుని తన భర్తకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గత వారం ఒక కార్యక్రమంలో ప్రసంగించిన ప్రియదర్శిని రాజే గత 20 సంవత్సరాలుగా జ్యోతిరాధిత్య సింధియా గుణ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజల పట్ల ఎంతో అప్యాయతతో ఉంటున్నారని తెలిపారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో గుణ ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు, ట్యాంకర్లు, ఆసుపత్రుల్లో మందులతో పాటు ఆహారం, నీరు సహా ఇతర అవసరాలకు ఎలాంటి కొరత ఉండకూడదని ఆయన తపించారని గుర్తు చేసుకున్నారు.