Republic Day Special Story :వ్యాపారం కోసం దేశంలోకి ప్రవేశించి, వనరులు దోచుకోడానికి నిశ్చయించుకొని, దేశంలోని అనైక్యతను ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారు. 'విభజించు పాలించు' అనే విధానం అవలంభించి దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకుపైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భరతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో విముక్తి లభించింది. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది. స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే. ఈ కథనంలో భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతను తెలుసుకుందాం.
నేటి తరానికి తెలుసా?
గణతంత్ర దినోత్సవ ప్రత్యేకత ఏంటని ఈ తరం వారిని అడిగితే వారికి ఈ రోజు ఒక పబ్లిక్ హాలిడే. కుటుంబంతో, స్నేహితులతో సరదాగా గడిపే ఒక సెలవు రోజు. అంతకు మించి వారికేమి తెలియదు. ఈ జాతీయ సెలవు రోజున ఎంత మంది స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటారంటే సమాధానం ఉండదు. దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అని ప్రశ్నిస్తే 'నో ఆన్సర్!'
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా?
అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. కానీ, దీని వెనుక బలమైన కారణం ఉంది. అదేమిటో చూద్దాం.
సంపూర్ణ స్వరాజ్య తీర్మానం
వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు. జలియన్ వాలాబాగ్ ఉదంతం తరువాత ఒక్కసారిగా కళ్లు తెరచిన భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా, మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు.
రాజ్యాంగ రూపకల్పన
జనవరి 26, 1950తో బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను ఎన్నికోగా, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ అంబేడ్కర్‌ను నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు ఖర్చయ్యింది.