తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కాంగ్రెస్ పతనానికి కారణాలేంటి? ఇదే రిపీట్ అయితే పార్టీ పరిస్థితేంటి? - MAHARASHTRA CONGRESS

మహారాష్ట్ర ఏర్పడిన నుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయిన కాంగ్రెస్​- కారణాలేంటి?

Maharashtra Congress Party
Maharashtra Congress Party (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 6:32 AM IST

Maharashtra Congress Party Position :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రదర్శన రోజురోజుకు దిగజారుతోంది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో కూడా గెలవలేక చతికిలబడింది. ప్రధాన పార్టీగా బరిలో నిలిచిన కాంగ్రెస్‌, మహాయుతి ధాటికి పసికూనల మారిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేని రీతిలో హస్తం పార్టీ ఆ రాష్ట్రంలో బలహీనపడింది. ఇదే దోరణి కొనసాగితే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు తెలిపారు.

కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎ‌న్నికల్లో 99 స్థానాల్లో దక్కించుకుని బీజేపీకీ పూర్తి అధిక్యాన్ని దక్కకుండా చేయడంలో ముఖ్యభూమిక పోషించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తేలిపోయింది. పొత్తులో భాగంగా 101 స్థానాల్లో బరిలో నిలిచిన కాంగ్రెస్‌ కనీసం 20 స్థానాల్లో కూడా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమి ఘోర ఓటమి చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను ఈ ఫలితాలు నిరాశకు గురిచేశాయి. దీంతో మహారాష్ట్రలోని MVA కూటమిని హస్తం పార్టీ బలహీన పరుస్తుందా అనే అనుమానాలు మిత్రపక్షాల నేతల మదిలో మెదులుతున్నట్లు తెలుస్తోంది.

34 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ!
దాదాపు 34 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ మహారాష్ట్రలో సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 1990లో శరద్‌ పవార్‌ నేతృత్వంలో 49 శాతం ఓట్లతో 141 స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ ఆ తర్వాత ఏ ఎన్నికలోను మూడంకెల సీట్లకు అందుకోలేక పోయింది. శరద్‌ పవార్‌ సొంత కుంపటి పెట్టుకోవడం వల్ల 1995లో హస్తం పార్టీ 80 సీట్లకే పరిమితమై రెండోసారి అధికారానికి దూరమైంది. అప్పటి వరకు హస్తం గుర్తుకు అండగా నిలిచిన మరాఠా ఓట్లను ఎన్సీపీతో కలిసి పంచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అనంతరం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టింది. 2004 నుంచి సీఎంగా కొనసాగిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ 2008 ముంబయి దాడుల అనంతరం నెలకొన్న పరిణామాలతో పదవి కోల్పోయారు. 2009లో ఎన్నికలకు అశోక్‌ చవాన్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన కాంగ్రెస్‌ కొంత మెరుగుపడి 82 సీట్లు సాధించింది.

2014లో కాంగ్రెస్‌ నేతలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, మోదీ హవాతో మహారాష్ట్రలో హస్తం పార్టీ తీవ్రంగా దెబ్బతింది. ఆ ఎన్నికల్లో కేవలం 42 సీట్లను మాత్రమే సాధించింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌ ప్రదర్శన నానాటికి దిగాజారుతూ వచ్చింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరిస్థితి మరి తీసికట్టుగా తయారైంది. కనీసం 20 స్థానాల్లో కూడా తమ అభ్యర్థులను గెలిపించుకోలేక బోల్తాపడింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం వంటివి దానికి ఎన్నికల్లో ప్రతికూలాంశాలుగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details