Youth Gets Justice After 4 Years : ఓ మహిళ తప్పుడు కేసుకు బలయ్యాడు ఓ యువకుడు. చేయని తప్పుకు సుమారు నాలుగేళ్లు జైలులో గడిపాడు. చివరకు అసలు నిజం బయటపడడం వల్ల 4ఏళ్ల 6నెలల 13 రోజుల తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. మహిళ తప్పడు కేసు పెట్టినందుకు ఆమెకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది కోర్టు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో జరిగింది.
ఇదీ జరిగింది
బరాదరి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ మహిళ 2019 డిసెంబర్ 2 తన కూతురిపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన 15ఏళ్ల కూతురిని అజయ్ అలియాస్ రాఘవ్ నమ్మించి దిల్లీకి తీసుకెళ్లాడని, మత్తు పదార్థాలు ఇచ్చి అత్యాచారం చేశాడని అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మొదట అజయ్ తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా నిందితుడు నాలుగేళ్లుగా జైలులో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టులో విచారణలో తన వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట ఆ బాలిక చెప్పింది. 2024 ఫిబ్రవరి 8న తాను చెప్పిన వివరాలు తప్పని తెలిపింది. అజయ్ తనకు ఎలాంటి హాని చేయలేదని, అతడు తనని దిల్లీకి కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది.