తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AI శిక్షణ ల్యాబ్‌లు, 25 లక్షల ఉద్యోగాలు- మహారాష్ట్ర ఓటర్లపై బీజేపీ హామీల వర్షం! - MAHASRASHTRA POLLS BJP MANIFESTO

మహారాష్ట్ర ఎన్నికల వేళ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల

Mahasrashtra Polls BJP Manifesto
Mahasrashtra Polls BJP Manifesto (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 12:20 PM IST

Updated : Nov 10, 2024, 2:20 PM IST

Mahasrashtra Polls BJP Manifesto :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంకల్ప పత్ర పేరుతో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ముంబయిలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో రైతుల పంట రుణాల మాఫీ, ఏఐ శిక్షణ ల్యాబ్‌లు, నైపుణ్య గణన, 25 లక్షల ఉద్యోగాలను ప్రధానంగా పేర్కొన్నారు. వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.2100కు పెంచుతామని చెప్పారు. మహారాష్ట్రను దేశంలో మొదటి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఓటర్లపై వరాల జల్లు
లడ్కీ బెహన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2100 ఆర్థిక సహాయం అందించనున్నట్లు అమిత్ షా తెలిపారు. సమ్మాన్ నిధి రూ.12,000 నుంచి రూ.15,000కి పెంచుతామని హామీ ఇచ్చారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.15 వేలు వేతనాన్ని ఇస్తామని పేర్కొన్నారు. "ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పారిశ్రామికవేత్తలకు రూ.15 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తాం. 2028 నాటికి మహారాష్ట్రను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. బలవంత మతమార్పిడులకు వ్యతిరేకంగా కఠినమైన చట్టం తెస్తాం. అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం" అని అమిత్ షా పేర్కొన్నారు.

'వారితో ఉద్ధవ్ జట్టు కట్టారు'
బాలాసాహెబ్ ఠాక్రే, వీర్ సావర్కర్​లను అవమానించిన కాంగ్రెస్​తో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే జట్టుకట్టారని బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శించారు. బాలాసాహెబ్ ఠాక్రే గౌరవార్థం ఏ కాంగ్రెస్ నాయకుడైనా కొన్ని మాటలు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వడానికి మహారాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించే నిబంధన రాజ్యాంగంలో లేదని వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రజలు గుర్తించాలని అన్నారు.

"వీర్ సావర్కర్ కోసం రెండు మంచి మాటలు చెప్పమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఉద్ధవ్ ఠాక్రే కోరగలరా? బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను శిలాశాసనాల్లా భావిస్తుంది. కచ్చితంగా వాటికి నెరవేరుస్తుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది. మహా వికాస్ అఘాడీకి విశ్వసనీయత లేదు. యూపీఏ ప్రభుత్వంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్ర ప్రజలకు తాను చేసిన సాయం ఏమిటో శరద్ పవార్ చెప్పాలి"
-- అమిత్ షా, బీజేపీ అగ్రనేత

'దేశాన్ని మహారాష్ట్ర ముందుకు నడిపిస్తోంది'
నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా తెలిపారు. 2027నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని పేర్కొన్నారు. 7 కోట్ల మరుగుదొడ్లు, పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్, తాగునీరు, ఉచిత వైద్యం అందించామని వెల్లడించారు. "మహారాష్ట్ర యుగయుగాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుండి నడిపిస్తోంది. భక్తి ఉద్యమం మహారాష్ట్ర నుంచి మొదలైంది. బానిసత్వం నుంచి విముక్తి కోసం ఉద్యమాన్ని శివాజీ మహారాజ్ ఉద్యమాన్ని మహారాష్ట్ర నుంచే ప్రారంభించారు. సామాజిక విప్లవం కూడా ఇక్కడి ప్రారంభమైంది. మహాయుతి ప్రభుత్వం రైతులు, మహిళలు, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. బీజేపీ మేనిఫెస్టో సంకల్ప్ పత్ర మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం" అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Last Updated : Nov 10, 2024, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details