UGC NET New Exam Dates: ప్రశ్నపత్రాల లీకేజీపై విమర్శలు కొనసాగుతున్న వేళ ఇటీవల రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా ప్రకటించింది. రద్దు చేసిన యూజీసీ-నెట్ పరీక్షను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈసారి ఆన్లైన్ విధానంలో ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. డార్క్‌నెట్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందనీ, టెలిగ్రామ్ యాప్‌లో సర్క్యులేట్ అయిందని పరీక్షను రద్దు చేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అటు ముందస్తు చర్యగా వాయిదా వేసిన సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ జూలై 25 నుంచి జూలై 27 వరకు జరగనుంది. జూన్ 12న షెడ్యూల్ చేసి కొన్ని గంటల ముందు వాయిదా పడిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET) జూలై 10న నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.
నీట్ లీకేజీ కేసులో ప్రిన్సిపల్, వైస్‌ప్రిన్సిపల్ అరెస్ట్
మరోవైపు నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహ్‌సానుల్, వైస్‌ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంను శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. హజారీబాగ్ నగరంలో జరిగిన నీట్ పరీక్ష నిర్వహణకు ఎహ్‌సానుల్, ఎన్టీఏ అబ్జర్వర్, ఒయాసిస్ స్కూల్ పరీక్ష కేంద్రానికి, ఎన్ ఇంతియాజ్ ఆలం సమన్వయకర్తగా వ్యవహరించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. వారిద్దరిని పూర్తిస్థాయిలో ప్రశ్నించిన తర్వాతే అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదే కేసులో జిల్లాకు చెందిన మరో అయిదుగురిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు.