UGC Biannual Admissions: విదేశీ వర్సిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది రెండు అడ్మిషన్ సైకిల్స్ ఉంటాయని అన్నారు. జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరి మధ్య దేశంలోని యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు.
"భారతీయ విశ్వవిద్యాలయాలు ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు ఇస్తే బోర్డు ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల జులై-ఆగస్టు సెషన్‌లో యూనివర్సిటీల్లో అడ్మిషన్లు కోల్పోయిన చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు పెట్టడం వల్ల విద్యార్థులకు ప్రయోజనం. ఎందుకంటే జూన్- ఆగస్టు సెషన్‌లో యూనివర్సిటీ లేదా ఉన్నత విద్యాసంస్థలో విద్యార్థులు చేరకపోయినా వారు మరుసటి ఏడాది వరకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ద్వైవార్షిక అడ్మిషన్ల వల్ల కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దీంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి." అని యూజీసీ చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు.