తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాణాలు పణంగా పెట్టి - రైలు ప్రమాదాన్ని తప్పించిన ట్రాక్‌మ్యాన్‌ - Konkan Railway Trackman Bravery

Konkan Railway Trackman Bravery : ఓ ట్రాక్‌మ్యాన్‌ చూపించిన ధైర్యం ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించింది. అతను చేసిన సాహసం వందలాది ప్రయాణికుల ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ట్రాక్​మ్యాన్​ను ఉన్నతాధికారులతో సహా అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఏమి జరిగిదంటే?

Konkan Railway Trackman Bravery
Konkan Railway Trackman Bravery (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 8:30 AM IST

Konkan Railway Trackman Bravery :విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్‌మ్యాన్‌ చూపిన తెగువ, సమయస్ఫూర్తి పెద్ద రైలు ప్రమాదాన్ని తప్పించింది. రైలు పట్టాలపై వెల్డింగ్ లోపాన్ని గుర్తించిన అతను, అదే మార్గంలో వస్తున్న ఓ ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు పట్టాల వెంట 5 నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు తీశారు. చివరికి రైలును ఆపి వందలాది మంది ప్రాణాలను కాపాడారు.

ఇదీ జరిగింది
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహాదేవ అనే ట్రాక్‌మ్యాన్‌ కొంకణ్‌ రైల్వే డివిజన్‌లో పనిచేస్తున్నారు. ఆయన తన విధుల్లో భాగంగా కొంకణ్‌ రైల్వే డివిజన్‌లోని కుమ్టా, హొన్నావర్‌ స్టేషన్‌ల మధ్య తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే తెల్లవారు జామున 4.50 గంటల సమయంలో ఓ చోట పట్టాల జాయింట్‌ వద్ద వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం - దిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. దీనితో వెంటనే అప్రమత్తమైన అతను కుమ్టా స్టేషన్‌కు సమాచారం అందించారు.

రియల్ హీరో
అయితే అప్పటికే రైలు ఆ స్టేషన్‌ను దాటి వెళ్లిపోయింది. దీనితో మహాదేవ నేరుగా లోకో పైలట్‌ను సంప్రదించేందుకు యత్నించారు. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన మహాదేవ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పట్టాల వెంట రైలుకు ఎదురుగా పరుగు తీశారు. రైలును ఆపేందుకు కేవలం ఐదు నిమిషాల్లోనే అర కిలోమీటర్ మేర పరిగెత్తారు. లోకోపైలట్​కు సిగ్నల్ అందించి, సకాలంలో రైలును నిలిపివేయించారు. ఫలితంగా ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఈ విధంగా ఒక సాధారణ ట్రాక్‌మ్యాన్ హీరోగా మారి వందలాది మంది ప్రాణాలు కాపాడారు. చివరికి వెల్డింగ్ పనులు పూర్తయిన తరువాత రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. వందలాది ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాదేవను ఉన్నతాధికారులు ఒక రియల్ హీరోగా కొనియాడారు. అతడిని సత్కరించి రూ.15 వేల నగదును బహుమతిని అందించారు. ప్రయాణికులందరూ మహాదేవ్​పై ప్రశంసల వర్షం కురిపించారు.

ABOUT THE AUTHOR

...view details