TMC MP Jawhar Sircar Resigns :బంగాల్లోని ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై ఇప్పటికే సీబీఐ విచారణ, సుప్రీం కోర్టు ఆగ్రహంతో అతలాకుతలం అవుతున్న మమత ప్రభుత్వానికి మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాసిన లేఖలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని లేఖలో ఎండగట్టారు. ఘటనపై చర్యలు తీసుకోవడాంలో మమత నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఆర్జీ కర్ ఘటనకు నిరసనగా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జవహర్ సర్కార్ లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మమతాకు రాసిన లేఖలో ''పార్టీలో అస్మదీయులు, అవినీతిపరులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అవినీతిపై ప్రభుత్వానికి ఆందోళన లేకపోవడం, ఒక వర్గం నాయకులు మిగిలిన వారిని అణగదొక్కడం వంటి చర్యలతో నాకున్న భ్రమలు తొలగిపోయాయి. అవినీతి అధికారులు అందలం ఎక్కడం వంటి విషయాలను నేను అంగీకరించలేకపోతున్నాను. పార్టీలో ఉన్న ఇన్ని సంవత్సరాలలో ఈ స్థాయి ఆందోళన, ప్రభుత్వ విశ్వాస రాహిత్యాన్ని నేను ఎన్నడూ చూడలేదు.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో భయంకర ఘటన జరిగిన తర్వాత ఓపిగ్గా నెలరోజులపాటు ఎదురు చూశాను. మీరు (మమతా బెనర్జీ) పాత శైలిలో నేరుగా రంగంలోకి దిగి జూనియర్ డాక్టర్ల సమస్యపై స్పందిస్తారని ఆశించాను. కానీ, అది జరగలేదు. ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆలస్యంగా అరకొర చర్యలు తీసుకొంది. పార్లమెంట్‌లో బంగాల్ సమస్యలు ప్రస్తావించేందుకు మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఇక ఎంపీగా కొనసాగలేను. అవినీతి, మతతత్వం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో నియంతృత్వంపై పోరాడటంలో ఏమాత్రం రాజీలేదు'' అని జవహర్ మమతకు రాసిన లేఖలో పేర్కొన్నారు.