తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోకల్​ గర్ల్​​ సుభిక్ష- సముద్రం లోపల యూట్యూబ్ Vlogs- పీతల పచ్చళ్లతో ఫుల్ ఫ్రావిట్స్​! - tamil female sea vlogger - TAMIL FEMALE SEA VLOGGER

Tamil Female Sea Vlogger : సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టే మత్స్యకార వృత్తి అనగానే ఇది పురుషులు చేసే పని అని ఈజీగా చెప్పేస్తుంటాం. కానీ తమిళనాడుకు చెందిన ఓ యువతి మాత్రం పురుషులకు ఏ మాత్రం తీసుపోకుండాఎంతో కష్టమైన మత్స్యకార వృత్తిని ఎంచుకుని రాణిస్తుంది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని సముద్రాన్ని జయంచి వస్తోంది. దీంతో పాటు అటు వ్యాపారంలోనూ రాణించి అనేక మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తొలి తమిళ 'సీ వ్లాగర్‌' యువతి కథేంటో మనం తెలుసుకుందాం.

tamil sea vlogger
tamil sea vlogger (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 7:25 PM IST

లోకల్​ గర్ల్​​ సుభిక్ష- సముద్రం లోపల యూట్యూబ్ Vlogs- పీతల పచ్చళ్లతో ఫుల్ ఫ్రావిట్స్​! (ETV Bharat)

Tamil Female Sea Vlogger : సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమంటే అంత సులభం కాదు. ఆ సమయంలో తలెత్తే ఇబ్బందులను పురుషులు సైతం తట్టుకోలేక అనేక అవస్థలు పడుతుంటారు. కానీ ఈ యువతి మాత్రం సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టడమే కాకుండా, మత్స్యకారుల జీవన స్థితిగతులు, కష్టనష్టాలను చూపిస్తూ తొలి తమిళ 'సీ వ్లాగర్‌'గా పేరు సంపాదించింది. అంతేకాకుండా చేపల పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించింది దిగ్విజయంగా నడిపిస్తోంది.

తమిళనాడు తూత్తుకూడి జిల్లాలోని పెరియాడాల గ్రామానికి చెందిన సుభిక్షకు చిన్ననాటి నుంచి సముద్రంలో చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. వయసు పెరుగుతున్న కొద్దీ సముద్రంలోకి వెళ్లాలనే ఆశ పెరుగుతూనే వచ్చింది. ఇంట్లో అనేక సార్లు చెప్పినా ఏదో ఒకటి చెబుతూ నచ్చచెప్పేవారు. తండ్రి తీసుకెళ్తానని చెప్పినా, మరుసటి రోజు తెల్లవారుజామున చెప్పకుండానే వేటకు వెళ్లిపోయేవాడు. దీంతో ఎక్కడ చెప్పకుండా వెళ్లిపోతారనే అనుమానంతో ఒక్కోసారి రాత్రుళ్లు నిద్రపోకుండా వేట కోసం మేల్కొని ఉండేది. చివరకు మరో మార్గం లేదనుకున్న సుభిక్ష తండ్రి, ఆమెను సముద్రంలోకి తీసుకెళ్లడం ప్రారంభించాడు.

"తమిళనాడులోనే తొలి 'సీ వ్లాగర్‌' అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఓ మహిళగా ఈ స్థానానికి చేరుకోవడానికి నేను అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాను. సముద్రంలో చేపలు పడతానంటే నా తండ్రి సహా అనేక మంది నిరుత్సాహపరిచారు. వారితో నన్ను సముద్రంలోకి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. తర్వాత తీసుకెళ్తామంటూ చెప్పి తప్పించుకునేవారు. కానీ, నేను సముద్రంలోకి వెళ్లేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టేదానిని కాదు. అందుకోసమే నేను వారందరికంటే ముందే నిద్రలేచి సిద్ధంగా ఉండేదానిని."

--సుభిక్ష, సీ వ్లాగర్‌

సాధారణంగా తొలిసారి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లేవారికి వాంతులు అవుతుంటాయి. ఉప్పునీటి నుంచి వచ్చే ఆ గాలిని పీల్చి అనేక మంది ఇబ్బందులకు గురవుతారు. కానీ తాను తొలిసారి వెళ్లినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకపోవడం వల్ల మత్స్యకారులంతా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సుభిక్ష చెప్పింది. ఇలా సుమారు ఏడాదిగా రోజూ చేపలు పట్టేందుకు వెళ్తున్నానని తెలిపింది. తూత్తుకూడిలోని ఓ ప్రైవేట్‌ మహిళల కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, సీ వ్లాగింగ్ చేస్తూ చేపలు పట్టేవాళ్ల జీవన స్థితిగతులను వివరిస్తోంది. ప్రస్తుతం తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 2లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని చెబుతోంది సుభిక్ష.

"కొద్ది రోజులు సీ వ్లాగింగ్ చేసిన తర్వాత నాకు పచ్చళ్ల వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే 'మీనవర్‌ పొన్ను సుబి మీన్‌ ఉరకాయ్‌' అనే పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాను. పచ్చి చేపలతో పాటు ఎండు చేపలను పచ్చడి పెట్టి అమ్మడం మొదలుపెట్టాను. ప్రస్తుతం 7రకాల పచ్చళ్లను విక్రయిస్తున్నా. ఇందులో పీతల పచ్చడిని మాత్రం అనేకమంది అమితంగా ఇష్టపడుతుంటారు. మొదట్లో నేను ఇంటి నుంచే పచ్చళ్లు అమ్మడం ప్రారంభించాను. కానీ ఆ తర్వాత చాలా స్టోర్ల నుంచి ఆర్డర్లు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇతర దేశాలకు ఈ వ్యాపారాన్ని విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను."

--సుభిక్ష, సీ వ్లాగర్‌

తొలినాళ్లలో పచ్చళ్లు రుచిగా వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకుంది సుభిక్ష. కేవలం తమిళనాడుకే పరిమితం కాకుండా బెంగళూరు, దిల్లీ లాంటి ప్రాంతాల్లోనూ పచ్చళ్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం దేశానికే పరిమితమైన ఈ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది సుభిక్ష.

ABOUT THE AUTHOR

...view details