Share Trading Fraud Techie :సైబర్ మోసగాళ్లు రోజురోజుకూ కొత్త కొత్త విధానాలు అనుసరిస్తున్నారు. ప్రజల అమయాకత్వాన్ని కొందరు క్యాష్ చేసుకుని మోసం చేస్తుంటే, మరికొందరు అత్యాశను ఆసరాగా తీసుకుని నిలువునా ముంచేస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తామని చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా మంచి రాబడి అందిస్తామని హామీ ఇచ్చి మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కేటుగాళ్లు మోసం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఠాణె జిల్లాలోని డోంబివిలికి చెందిన బాధితురాలిని జులై నెలలో కొందరు వ్యక్తులు సంప్రందించారు. షేర్ ట్రేడింగ్‌లోకి వస్తే మంచి రాబడి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పలుమార్లు ఆమెతో మాట్లాడి ఆశ కల్పించారు. ఆ తర్వాత ఆమెను వివిధ సోషల్ మీడియా గ్రూప్స్‌లో యాడ్ చేశారు. దీంతో మంచి రాబడిని ఆశించి రూ.91,05,000 పెట్టుబడి పెట్టారు బాధితురాలు.
కానీ ఇంతకుముందు సైబర్ మోసగాళ్లు చెప్పినట్లు, ఆమెకు ఎలాంటి డబ్బులు అందలేదు. దీంతో వారికి ఫోన్ చేయగా స్పందించలేదు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించిన సదరు మహిళ, మాన్‌పాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులపై సంబంధిత చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.