Swati Maliwal Assault Case : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బిభవ్ తనను దారుణంగా కొట్టాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు తన్నాడని స్వాతి మాలీవాల్ ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న దిల్లీ పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
వాంగ్మూలంలో విస్తుపోయే విషయాలు
పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. బిభవ్ తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, ఆమె ఆరోపించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. దాడి జరిగిన ఘటనను ఆమె పోలీసులకు వివరించారు. సీఎం కేజ్రీవాల్ నివాసంలో బిభవ్ కుమార్ తన చెంపపై కొట్టి, కాలితో తన్ని కర్రతో కొట్టినట్లు స్వాతి మాలీవాల్ వాపోయారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టినట్లు ఆమె ఆరోపించారు. బిభవ్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేసినట్లు స్వాతి వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
అటు ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన స్వాతి మాలీవాల్, ప్రతిసారిలాగే రాజకీయ హిట్‌మ్యాన్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారని ఆరోపించారు. తన మనుషులతో వీడియోలు, ట్వీట్లు చేయిస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పారు. దేవుడు ప్రతిదీ గమనిస్తున్నారని, ఒకరోజు సత్యం కచ్చితంగా ప్రజల ముందుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతకుముందు తనకు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని దీనిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు. ఇటీవలి రోజులు చాలా కష్టంగా గడిచాయని తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని తెలిపారు. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రస్తుత తరుణంలో స్వాతి మాలీవాల్ అంత ముఖ్యం కాదన్నారు. దేశంలోని సమస్యలే కీలకమని ఈ ఘటనను రాజకీయాల్లోకి లాగొద్దని బీజేపీ శ్రేణులకు ప్రత్యేక విన్నపం చేశారు.
పరారీలో బిభవ్ కుమార్
ఈ ఘటనలో బిభవ్ కుమార్ పలు సెక్షన్లపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. IPC 354, 506, 509, 323తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళపై దాడి, నేరపూరిత బెదిరింపు, అసభ్య పదజాలం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం కేజ్రీవాల్ నివాసంలోని ఎనిమిది సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలీవాల్‌ను కలిసిన వారందరి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దాదాపు 10 పోలీసు బృందాలు బిభవ్ ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో స్వాతి మాలీవాల్ తన వాంగ్మూలాన్ని కోర్టులో సమర్పించారు. తీస్ హజారీ కోర్టు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.