Suresh Gopi Minister :కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సినీ నటుడు, కేరళ బీజేపీ ఎంపీ సురేశ్ గోపి తన పదవికి రాజీనామా చేస్తారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. త్రిసూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన సురేశ్ గోపి ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ తర్వాత తాను మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని సురేశ్ గోపి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు.
అసలేం జరిగిందంటే?
ఇప్పటికే ఒప్పుకున్న అనేక సినిమాలను పూర్తి చేయాల్సి అవసరం ఉందని, కేంద్ర మంత్రివర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు సురేశ్ గోపి చెప్పినట్లు సోమవారం ఉదయం వార్తలు వచ్చాయి. ఇప్పటికే రాజీనామా విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి కూడా తెలియజేశానని ఆయన చెప్పినట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో ఈ విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సమస్య పరిష్కారం!
అయితే సినీ నటుడు సురేశ్ గోపి సమస్య పరిష్కారమైందని బీజేపీ అధికారి ఒకరు ఈటీవీ భారత్‌తో తెలిపారు. సురేశ్ గోపి లేవనెత్తిన అంశాలపై ఆయనతో హైకమాండ్ చర్చించిందని తెలిపారు. తన కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు అగ్రనేతలు గడువు ఇచ్చినట్లు కూడా చెప్పారు.
ఒక్క ట్వీట్‌తో క్లారిటీ
తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వచ్చిన వార్తలపై సురేశ్ గోపి సోషల్ మీడియాలో స్పందించారు. 'కేంద్ర మంత్రి మండలికి నేను రాజీనామా చేస్తానంటూ కొందరు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం నేను కట్టుబడి ఉన్నాను" అని సురేశ్ గోపి ట్వీట్ చేశారు.
అయితే కేరళలో బీజేపీ సురేశ్ గోపి ద్వారా బోణీ కొట్టినా ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే భావన అభిమానుల్లో ఉందని వార్తలు వచ్చాయి. సురేశ్ గోపి కూడా కేబినెట్ బెర్త్ వస్తుందని ఆశించగా, సహాయ మంత్రి పదవి దక్కడం వల్ల అసంతృప్తికి లోనైట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి. ఇక మోదీ ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన తేనేటి విందుకు కూడా సురేశ్ గోపి హాజరు కాలేదు. నేరుగా రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ప్రమాణం స్వీకారం చేశారు.