Supriya Sule On Bitcoin Issue : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార పార్టీ, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బిట్‌కాయిన్ల గురించి ప్రచారంలో ఉన్న వాయిస్ నోట్స్, సందేశాలన్నీ నకిలీవని, అది తన వాయిస్ కాదని ఎన్సీపీ(ఎస్పీ) నేత సుప్రియ సూలే అన్నారు. కావాలనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
'ఎక్కడికైనా వచ్చి సమాధానం చెబుతా'
తాను అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడినట్లు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది చేసిన ఆరోపణలను సుప్రీయ సూలే కొట్టిపారేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేవుని, అందుకే పోలీసులు తనను అరెస్టు చేయరనే నమ్మకం ఉందని తెలిపారు. దీనిపై ఇప్పటికే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశానన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు ఎంపీ సుధాంశు త్రివేదికి పరువునష్టం దావా నోటీసులు పంపినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికి వచ్చి సమాధానం చెప్పమన్నా తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ఇదీ జరిగింది
మంగళవారం జరిగన ఓ విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది పలు ఆడియో క్లిప్‌లను వినిపించి, సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మాజీ పోలీసు కమిషనర్, ఇతరులతో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ పోలీసు అధికారి, డీలర్‌కు మధ్య జరిగిన చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా పంచుకున్నారు. ఎన్నికల ఫలితాలను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడికి అనుకూలంగా మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శలు చేశారు. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రియా సూలే, కాంగ్రెస్ చీఫ్ నానా పటోలేపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేవు
మహారాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పందించారు. స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి సీసీటీవి చూడలని అందులో ఎక్కడ, ఎవరు డబ్బులను పంపిణీ చేశారో చెప్పాలని అన్నారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ, సుప్రియా సూలే, నానా పటోల్‌కు ఓపెన్ ఛాలేంజ్ చేస్తున్నా అని తెలిపారు.