తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వడంలో సెలక్షన్ వద్దు- అప్పట్లోగా మొత్తం సమాచారం అందించాల్సిందే'

Supreme Court On Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని మరోసారి ఆదేశించింది సుప్రీంకోర్టు. వివరాలను బహిర్గతం చేయడంలో ఎస్‌బీఐ సెలెక్టివ్​గా ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేసింది.

Supreme Court On Electoral Bonds
Supreme Court On Electoral Bonds

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 11:23 AM IST

Updated : Mar 18, 2024, 1:05 PM IST

Supreme Court On Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి ఎస్​బీఐ సెలెక్టివ్​గా ఉండకూడదని, మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. బాండ్ల నంబర్‌లతో సహా ఎలక్టోరల్ బాండ్లపై సమాచారన్నంతా అడిగినట్లు గుర్తు చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది. నంబర్లతో సహా అన్ని వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్‌బీఐని ఆదేశించింది.

'ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు'
"బాండ్ల విషయంలో ఎస్‌బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించి ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్‌ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్‌బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు" అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందే
ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను (నంబర్లతో సహా) ఈసీకి ఇచ్చేశామని చెబుతూ మార్చి 21 (గురువారం) సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఇవ్వాల్సి ఉంటే, అవి కూడా ఇస్తామని ఎస్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే తెలిపారు.

న్యూమరిక్‌ నంబర్లను ఇవ్వకపోవడం వల్లే!
ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఐదేళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంకు- బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి/సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

బీజేపీపై కాంగ్రెస్​ ఫైర్​!
మరోవైపు, ఎన్నికల బాండ్ల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విరుచుకుపడింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని ప్రధాన మంత్రి హఫ్తా వసూలి యోజనగా అభివర్ణించింది. సీబీఐ, ఈడీ, ఐటీ దర్యాప్తు ఎదుర్కొంటున్న 21 సంస్థలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు ఇచ్చినట్లు ఆరోపించింది. ఎలక్టోరల్ బాండ్ స్కామ్​కు సంబంధించిన అసలు గుట్లు రోజురోజుకూ బయటపడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ తెలిపారు.

ప్రధాన మంత్రి హఫ్తా వసూలీ యోజన!
అయితే ఎలక్టోరల్ బాండ్ల స్కామ్​లో అవినీతికి సంబంధించి రెండో కాన్సెప్ట్​ను ప్రధాన్ మంత్రి హఫ్తా వసూలీ యోజన గురించి వివరిస్తామంటూ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. "2022 నవంబర్ 10న దిల్లీ మద్యం పాలసీ కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ పి శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. అక్కడి ఐదు రోజుల తర్వాత అరబిందో ఫార్మా రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చింది. 2018లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్​పై ఐటీ దాడులు చేసింది. అక్కడి ఆరు నెలల తర్వాత 2019 ఏప్రిల్‌లో రూ. 30 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది" అని జైరాం ఆరోపించారు.

"2023 డిసెంబర్ 7వ తేదీన రుంగ్టా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు యూనిట్లపై ఐటీ శాఖ దాడులు చేసింది. 2024 జనవరి 11న మూడు యూనిట్లు రూ. కోటి విలువైన 50 ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. హైదరాబాద్‌కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్​పై 2023లో ఐటీ శాఖ సోదాలు జరిపింది. ఇక ఈ ఏడాది జనవరి 11న ఆ కంపెనీ రూ. 40 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది" అంటూ పలు మిగతా కంపెనీలపై కూడా ఆరోపణలు చేశారు జైరాం రమేశ్.

'26రోజులుగా ఏం చేశారు?'- SBIపై సుప్రీం ఫైర్- ఎలక్టోరల్ బాండ్ల లెక్క తేల్చాలని స్పష్టం

ఏంటీ ఎన్నికల బాండ్లు? ఎందుకు రాజ్యాంగ విరుద్ధం? ప్రజాస్వామ్యానికి అంత నష్టమా?

Last Updated : Mar 18, 2024, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details