Students Cross River To Reach School :మధ్యప్రదేశ్ దతియా జిల్లాలో విద్యార్థులు ప్రతిరోజు నడుములోతు ప్రవహిస్తున్న నదిని దాటుతూ పాఠశాలకు వెళ్తున్నారు. ఓ చేత్తో తమ యూనిఫాం తడవకుండా జాగ్రత్త పడాలి, మరోవైపు చేతితో చెప్పుల జత జారకుండా పట్టుకువాలి ఇవే అనుకుంటే తలపైన ఉన్న పుస్తకాల సంచి నీటిలో పడకుండా చూసుకోవాలి. ఇలా సాహసం చేస్తే తప్ప పాఠశాలకు ఆ విద్యార్థులు వెళ్లలేరు.
భందేర్ నియోజకవర్గంలో తగా పంచాయితీ విద్యార్థులు నరేటా గ్రామంలోని పాఠశాలకు వెళ్లడానికి పడే పాట్లు ఇవి. ఈ రెండు గ్రామాల మధ్య దూరం సుమారు కిలోమీటరు ఉంటుంది. కానీ ఆ దారిలో ఏడాది పొడవునా ప్రవహించే నది ఉంది. ఈ కారణంగా విద్యార్థులు, గ్రామస్థులు ఎప్పుడు ఆ గ్రామానికి వెళ్లాలన్నా, ఈ నదిని దాటాల్సి వస్తోంది. ఒక్కోసారి నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల విద్యార్థులు, గ్రామస్థులు నీటి ప్రవాహంలో గల్లంతైన సందర్భాలూ ఉన్నాయని స్థానికులు తెలిపారు.
నదిలో పాములు, పదునైనా రాళ్లు, గాజు ముక్కలు కారణంగా విద్యార్థులకు గాయలవుతున్నాయని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ నదిపై వంతెన నిర్మించడానికి ప్రభుత్వ అధికారులకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదని అన్నారు. ఇక్కడ వంతెన నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. విద్యార్థలందరూ కలిసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ నదిపై వంతెన నిర్మించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఇక ప్రభుత్వం తమకు సహాయం చేయకపోతే ఓ పడవ కొని, పిల్లలను నది దాటిస్తాం అని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు.