Sonia Gandhi On Union Budget: కాంగ్రెస్కు అనుకూలంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని, అలా అతి విశ్వాసంతో ఉండొద్దని పార్టీ నేతలకు అగ్రనాయకురాలు సోనియా గాంధీ సూచించారు. లోక్సభ ఎన్నికల మాదిరిగానే త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ పోరులో కూడా అదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోదీ సర్కార్ పాఠాలు నేర్చుకుంటుందని అనుకున్నామని అన్నారు. కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాలవారీగా విభజించి భయం, శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
"మనం ఆత్మసంతృప్తి చెందకూడదు. అలాగే అతి ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు. లోక్సభ ఎన్నికల్లో చూపిన తెగువను చూపించి పోరాడితే జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం. కావడి యాత్ర మార్గంలో హోటళ్ల ముందు యజమానుల పేర్లతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ సర్కార్ ఇచ్చిన ఉత్తర్వులపై అదృష్టవశాత్తూ సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించింది. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాలుపంచుకునేలా నిబంధనలను ఎన్డీఏ సర్కార్ అకస్మాత్తుగా ఎలా మార్చిందో చూడండి. ఆర్ఎస్ఎస్ తనను తాను సాంస్కృతిక సంస్థగా అభివర్ణించుకుంటుంది. అయితే ఆర్ఎస్ఎస్ బీజేపీ రాజకీయ సైద్ధాంతిక పునాదని ప్రపంచమంతా తెలుసు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఊపును, సానుకూలతను కొనసాగించాలి. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలి"
-సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్