Army Bus Accident :జమ్ముకశ్మీర్‌లో వాహనం లోయలోపడి ఐదుగురు సైనికులు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పూంఛ్ జిల్లా ఎల్ఓసీ సమీపంలోని ఘరోయా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. జవాన్ల వాహనం 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌తో సహా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని సైన్యం తెలిపింది.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని డిఫెన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బహుశా రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అన్నారు. బనోయికి ఆరు వాహనాలతో కూడిన కాన్వాయ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, లోయ నుంచి జవాన్ల మృతదేహాలను వెలికి తీసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను పూంఛ్‌లోని ఫీల్డ్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.