Sitaram Yechury Passed Away :ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడం వల్ల తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం 3.03 గంటలకు ఆయన ప్రాణాలు విడిచారు. ఈ మేరకు ఆస్పత్రితోపాటు సీపీఎం పార్టీ వర్గాలు తెలిపాయి.
న్యుమోనియా వ్యాధితో బాధపడుతున్న సీతారాం ఏచూరి, ఆగస్టు 19న చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడించారు. అయితే సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఆయన కుటుంబసభ్యలు దిల్లీ ఎయిమ్స్‌కు దానం చేశారు. బోధనతోపాటు పరిశోధన ప్రయోజనాల కోసం ఏచూరి భౌతికకాయాన్ని డొనేట్ చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది.
గళం వినిపించారు : రాష్ట్రపతి ముర్ము
సీతారాం ఏచూరి మృతిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. " ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నాను. మొదట విద్యార్థి నాయకుడిగా, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో, పార్లమెంటేరియన్‌గా తన స్వరం వినిపించారు. నిబద్ధత ఉన్న సిద్ధాంతకర్త అయినప్పటికీ అన్ని వర్గాల్లో స్నేహితులను సంపాదించుకున్నారు. అతని కుటుంబ సభ్యులతో పాటుగా సహచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను" అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఆయన మరణ వార్త నన్ను బాధించింది : ప్రధాని మోదీ
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. "సీతారాం ఏచూరి మృతి నన్ను బాధించింది. వామపక్షాలలో ఆయనో గొప్ప వ్యక్తి. వామపక్షాలకు ఆయన ఓ మార్గదర్శి. సమర్థవంతమైన పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలన్నీ ఆయన కుటుంబసభ్యులపైనే ఉన్నాయి." అని అన్నారు.
భారతదేశ ఆలోచనలకు రక్షకుడు : రాహుల్ గాంధీ
అయితే సీతారాం ఏచూరి మరణం పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. "సీతారాం ఏచూరి నాకు ఒక స్నేహితుడు. లోతైన అవగాహనతో భారతదేశ ఆలోచనలకు రక్షకుడు. ఆయనతో జరిపిన సుదీర్ఘ చర్చలను కోల్పోయాను. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పోస్ట్ చేశారు.