Significance Of Name Annamalai in Tamilnadu :'అన్నామలై' అనగానే మనకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు గుర్తుకొస్తారు! వాస్తవానికి ఆ పదం తమిళనాడులో మనుషుల పేర్లకే పరిమితం కాదు. అంతకంటే చాలా ఎక్కువ విలువను 'అన్నామలై' పదానికి తమిళులు ఇస్తుంటారు. ఎందుకంటే తమిళుల చారిత్రక, సామాజిక, సాంస్కృతిక కోణాలతో ఈ పదానికి అవినాభావ అనుబంధం ఉంది. అన్నామలై అనే పేరును వినగానే తమిళులు గర్వించేలా చేసిన చారిత్రక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న అన్నామలై
తమిళులు చిన్న అన్నామలై అనే పేరును వినగానే చాలా గర్వంగా ఫీలవుతారు. ఎందుకంటే ఆయన దేశభక్తి అనన్య సామాన్యం. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీకి కీలక అనుచరుడిగా చిన్న అన్నామలై వ్యవహరించారు. గాంధీజీతో కలిసి సుదీర్ఘ పాదయాత్రల్లో పాల్గొన్నారు. 1920 - 1980 కాలానికి చెందిన ఈయన తన ప్రసంగాలతో ప్రజలను ఎంతో ఆకట్టుకునేవారు. క్విట్ ఇండియా ఉద్యమం టైంలో 1942లో చిన్న అన్నామలైను బ్రిటీష్ పాలకులు అరెస్టు చేసి రామనాథపురం జిల్లాలోని తిరువాడనై జైలులో పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన అభిమానులు జైలుపై దాడి చేసి చిన్న అన్నామలైను విడిపించి తీసుకెళ్లారు. ఆనాడు చిన్న అన్నామలై అభిమానులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. మళ్లీ పోలీసులు చిన్న అన్నామలైను అరెస్టు చేసి జైల్లో వేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా ఆయన తరఫున న్యాయవాదిగా, ప్రఖ్యాత నాయకుడు చక్రవర్తుల రాజగోపాలాచారి హాజరై వాదనలు వినిపించారు. దీంతో ఎట్టకేలకు అన్నామలైకు బెయిల్ వచ్చింది.
అన్నామలై చెట్టియార్
తమిళనాడుకు చెందిన ఓ ప్రఖ్యాత పరోపకారి, పారిశ్రామికవేత్త పేరు రాజా సర్ అన్నామలై చెట్టియార్. ఈయన 1881-1948 కాలానికి చెందినవారు. తమిళనాడులోని ప్రముఖ అన్నామలై యూనివర్సిటీని 1929 సంవత్సరంలో స్థాపించింది ఈయనే. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తోంది. తమిళ సంగీతాన్ని ప్రచారం చేయడానికి 1943లో 'తమిళ ఇసై సంగమ్'ను కూడా అన్నామలై చెట్టియార్ స్థాపించారు. చెన్నైలోని డౌన్‌టౌన్ ప్యారీ ఏరియాలో ఉన్న రాజా అన్నామలై మండ్రం భవనాన్ని నిర్మించింది కూడా ఈయనే. ఈ బిల్డింగ్‌లో తమిళ సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.