Shiv Sena Leader Son Shot Dead :మహారాష్ట్రలో ఇటీవల శివసేన శిందే వర్గం నేతపై పోలీస్ స్టేషన్‌లోనే ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు పాల్పడిన ఘటన మరువకముందే ఇదే తరహాలో మరో ఘటన జరగడం కలకలం రేపింది. శివసేన-యూబీటీ వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసాల్కర్‌పై సామాజిక కార్యకర్త మౌరిస్ నొరోన్హా ఫేస్‌బుక్ లైవ్‌లోనే కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని చనిపోయాడు. పశ్చిమ బోరివాలి శివారులోని ఐసీ కాలనీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఘోసాల్కర్, నొరోన్హాకు వ్యక్తిగత శత్రుత్వం ఉందని పోలీసులు చెప్పారు. అయితే ఐసీ కాలనీ ప్రాంత అభివృద్ధి కోసం వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారని స్పష్టం చేయడానికి ఫేస్‌బుక్ లైవ్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఘోసల్కర్ పొత్తికడుపు, భుజంపై నిందితుడు మౌరిస్ నొరోన్హా మూడు రౌండ్లు కాల్చినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.
ఈ ఘటనలో నిందితుడు అక్కడికక్కడే చనిపోగా అభిషేక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఎమ్మెల్యే వినోద్ ఘోసల్కర్ కుమారుడు అభిషేక్ మాజీ కార్పొరేటర్ అని తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం సీఎం శిందేను నిందితుడు మౌరిస్ నోరోన్హా కలిశాడనీ శివసేన-యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్‌లో ఆరోపించారు. శివసేన శిందే వర్గంలో చేరాల్సిందిగా ఆయన నిందితుడిని కోరారని చెప్పారు. ఘటనకు బాధ్యత వహిస్తూ ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.