Mumbai Toll Tax Exemption :టోల్ ఫీజుల వసూలుకు సంబంధించి మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయికి వెళ్లే మార్గంలోని మొత్తం ఐదు టోల్ బూత్‌ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజులను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సీఎం ఏక్‌నాథ్ శిందే ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ టోల్ మినహయింపు అమలులోకి వస్తుందని సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తెలిపారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వాహనదారులకు ఐదు టోల్‌ప్లాజాల వద్ద ఫీజుల నుంచి మినహయింపు లభించనుంది. ఇకపై దహీసర్, ములుంద్, వైశాలి, ఐరోలి, ఆనంద్ నగర్ టోల్ ప్లాజాలో లైట్ మోటార్ వాహనాదారులు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదని మంత్రి దాదాజీ దగదు భూసే అన్నారు. 'ప్రస్తుతం టోల్ ఫీజుగా రూ.45, రూ.75 వసూలు చేస్తున్నాం. దాదాపు 3.5 లక్షల వాహనాలు ఈ మార్గంలో ప్రవేశిస్తాయి. వాటిలో 70 వేల హైవీ వాహనాలు కాగా, 2.80 లక్షలు చిన్నవి ఉన్నాయి. ఈ నిర్ణయం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో ప్రజలు క్యూలలో ఉండే సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం చాలా కాలంగా చర్చించిన తర్వాతే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది' అని దాదాజీ అన్నారు.