తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇంకొన్ని రోజులు దిల్లీలోనే హసీనా'- 'బంగ్లా పరిస్థితులు భారత్​కు ఓ గుణపాఠం!' - Bangladesh Crisis - BANGLADESH CRISIS

Sheikh Hasina In Delhi : షేక్ హసీనా ఇంకొంత కాలం మనదేశంలోనే ఉండనున్నారు. ఈవిషయాన్ని స్వయంగా ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు.

Sheikh Hasina Stay In Delhi
Sheikh Hasina Stay In Delhi (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 6:31 PM IST

Sheikh Hasina In Delhi : ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు చేరుకున్న షేక్ హసీనా ఇంకొంత కాలం మన దేశంలోనే ఉండనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ బుధవారం వెల్లడించారు. జర్మనీ ప్రభుత్వ మీడియా సంస్థ డాయిష్ వెల్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

'ప్రస్తుతం హసీనా ఏదైనా దేశంలో అశ్రయం పొందే ఆలోచన చేయడం లేదు. ఇంకొన్ని రోజులు ఆమె దిల్లీలోనే ఉంటారు. హసీనా ఒంటరిగా లేరు. ఆమె సోదరి రేహానా కూడా దిల్లీలోనే ఉన్నారు. బంగ్లాదేశ్, భారత్ మినహా మరో మూడో దేశానికి హసీనా వెళ్లిపోతారనేవి ఊహాగానాలు మాత్రమే' అని సజీబ్ తేల్చి చెప్పారు. హసీనా సోదరి రేహానా లేదా మరెవరైనా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని ఇంటర్వ్యూలో సజీబ్‌ను ప్రశ్నించారు. 'మా కుటుంబానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరగడం ఇది మూడోసారి. అందుకే హసీనా మినహా ఆమె కుటుంబ సభ్యులంతా విదేశాల్లోనే స్థిరపడ్డారు' అని బదులిచ్చారు.

హసీనా కుమార్తె కూడా దిల్లీలోనే!
ప్రస్తుతం షేక్ హసీనా కుమార్తె సల్మా వాజెద్ కూడా దిల్లీలోనే ఉన్నారు. ఆమె ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా రీజియనల్ డైరెక్టర్ హోదాలో సేవలు అందిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయాసియా విభాగం కార్యాలయం మన దేశ రాజధానిలోనే ఉంది. షేక్ హసీనా సోదరి షేక్ రేహానా కుమార్తె తులీప్ సిద్దిఖీ ప్రస్తుతం బ్రిటీష్ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. హసీనాకు యూకేలో ఆశ్రయం కల్పించాలని తులీప్ సిద్దిఖీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు యూకే ప్రభుత్వం నిరాకరించింది.

బంగ్లా పరిస్థితులు భారత్​కు ఓ గుణపాఠం
నియంతృత్వ పాలన ఎక్కువ కాలం కొనసాగదని కశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిణామాలు భారత్‌లోని పాలకులకు ఒక పాఠం లాంటివని ఆమె కామెంట్ చేశారు. 'యువతను అణచివేస్తే తిరుగుబాటు తప్పక వస్తుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుండా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా, ప్రజలను విద్యకు దూరం చేసేలా విధానాలను అవలంభిస్తే బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు కశ్మీర్‌లోనూ తలెత్తుతాయి. నిరంకుశ చట్టాలతో పాలన సాగిస్తున్నప్పుడు ప్రజలు తప్పక తిరగబడతారు. అలాంటప్పుడు షేక్ హసీనా ఎదుర్కొన్న చేదు అనుభవాన్నే భారత పాలకులూ ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు కశ్మీర్‌లో ఉన్నాయి. యూఏపీఏ, పీఎస్ఏ లాంటి చట్టాలతో కశ్మీరీ యువత విసిగివేసారిపోయారు. బంగ్లాదేశ్ తరహా తిరుగుబాటు కశ్మీర్‌లో జరగకూడదని నేను కోరుకుంటున్నాను' అని ముఫ్తీ తెలిపారు.

భారత్‌-బంగ్లా వాణిజ్యం త్వరలోనే పూర్వస్థితికి!
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొనడం వల్ల ప్రతిష్టంభన నెలకొంది. అయినప్పటికీ అతి త్వరలోనే బంగాల్‌లోని సరిహద్దు చెక్‌పోస్టుల మీదుగా బంగ్లాదేశ్‌కు వాణిజ్యం పూర్వస్థితికి చేరుకుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. బంగాల్​ సరిహద్దు నుంచి బంగ్లాదేశ్ వరకు ఉన్న చెక్‌పోస్టుల మధ్య సరుకు రవాణాకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఇరుదేశాల ఉన్నతాధికారులు బుధవారం భేటీ కానున్నారు. మన దేశంలోనే అతిపెద్ద సరిహద్దు చెక్ పాయింట్ 'పెట్రా పోల్' బంగాల్‌లోని ఉత్తర 24 పరణాల జిల్లాలో ఉంది. ఇరుదేశాల ఉన్నతాధికారులు 'పెట్రా పోల్​'లో సమావేశం అవుతారు.

లెక్చరర్ టు ప్రభుత్వ సారథి- ఎవరీ మహ్మద్‌ యూనస్? - Bangladesh Crisis

రగులుతున్న బంగ్లాదేశ్​- వెంటాడి, వేటాడి హసీనా పార్టీ నేతల ఊచకోత- హీరోను కూడా వదల్లేదు! - bangladesh crisis Updates

ABOUT THE AUTHOR

...view details