Shashi Tharoor on Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకొందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ఆమెకు మనం సాయం చేయకపోతే, అది భారత్‌కు అవమానమే అవుతుందని పేర్కొన్నారు. పొరుగుదేశంలో అధికార మార్పు భారత్‌ను ఆందోళనకు గురిచేసే అంశమే కాదన్నారు. తాజాగా ఓ వార్తసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
'షేక్ హసీనాకు మనం సాయం చేయకపోతే, భవిష్యత్తులో ఎవరూ మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడరు. మన మిత్రులు సమస్యల్లో ఉంటే, ఎప్పుడూ సాయం చేయడానికి ఆలోచించకూడదు. కచ్చితంగా వారిని సురక్షితంగా ఉంచేలా చూడాలి. ఇప్పుడు భారత్ కూడా అదే పని చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. అంతకు మించి నేనేమీ కోరుకోవడం లేదు. ఒక భారతీయుడిగా మనం ప్రపంచం కోసం నిలబడే విషయంలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి. షేక్ హసీనాను ఇక్కడికి తీసుకొచ్చి రక్షణ కల్పించి ప్రభుత్వం సరైన పనే చేసింది. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉంటారన్నది మనకు అనవసరం. మనం ఎవరినైనా ఇంటికి పిలిచిన తర్వాత ఎప్పుడు వెళ్లిపోతారు అని అడగము కదా. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే, అప్పటి వరకు మనం వేచి చూసే వైఖరిని పాటించాలని భావిస్తున్నా' అని శశి థరూర్ అన్నారు.