తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చంద్రబాబు స్ట్రాంగ్ లీడర్​, కేంద్రంలో ఆయనే కింగ్ మేకర్- మోదీ కొన్నిసార్లు రాజీపడాల్సిందే!' - Senior Journalist N Ram Interview - SENIOR JOURNALIST N RAM INTERVIEW

Senior Journalist N Ram on CBN : ఎన్​డీఏ సర్కార్ భవితవ్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్​పై ఆధారపడి ఉందని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబు విశ్వసనీయత, అనుభవం గల బలమైన నాయకుడని తెలిపారు. మునుపటిలా ప్రధాని మోదీ ఈ సారి ప్రభుత్వాన్ని నడపడం కష్టమని, కొన్ని విషయాల్లో రాజీపడాల్సి వస్తుందని ఎన్ రామ్ అభిప్రాయపడ్డారు.

CBN
CBN (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 12, 2024, 12:20 PM IST

Senior Journalist N Ram on CBN :తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశ్వసనీయత గల నాయకుడని ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్ కొనియాడారు. చంద్రబాబు లౌకిక వాదానికి ప్రాధాన్యం ఇస్తారని పేర్కొన్నారు. ఈసారి ఎన్​డీఏ సర్కార్ భవితవ్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్​పై ఆధారపడి ఉందని సీనియర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర సర్కారులో చంద్రబాబు, నీతీశ్ కుమార్ కింగ్ మేకర్లని పేర్కొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మంచి అనుభవం, బలమైన నాయకుడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఈ సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిందని వివరించారు. కేంద్రంలో ఎన్​డీఏ సర్కార్ మూడోసారి ఏర్పడిన నేపథ్యంలో ఎన్ రామ్ ఈటీవీ భారత్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చంద్రబాబు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

మిత్రపక్షాలతో రాజీపడటం అవసరం
'మునుపటిలా ప్రధాని మోదీ ఈ సారి ప్రభుత్వాన్ని నడపడం కష్టం. కొన్ని విషయాల్లో రాజీపడాల్సి వస్తుంది. 2019లో బీజేపీ 303 సీట్లు సాధించి సొంతంగానే అధికారంలో వచ్చింది. ఈసారి గతంతో పోలిస్తే 63 సీట్లు తగ్గాయి. మెజారిటీ మార్క్​కు 32 తగ్గి 240 సీట్లకు కమలం పార్టీ పరిమితమైంది. దీంతో కేంద్ర సర్కార్ కొన్ని విషయాల్లో మిత్రపక్షాలతో రాజీపడాల్సి వస్తుంది. ఈసారి ఎన్​డీఏ సర్కార్ గత 10ఏళ్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. 2014లో మోదీ తన తొలి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అజెండాగా ప్రచారం చేశారు. అప్పట్లో బీజేపీ 32 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019లో బీజేపీకి 37 శాతం ఓట్లతో 303 సీట్లు గెలుచుకుంది. 2024 ఎన్నికల్లో మోదీ అజెండా మొత్తం మారిపోయిందని' అని ఎన్​ రామ్ తెలిపారు.

మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్
నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్​ఆర్​సీ) చట్టం దేశంలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించిందని ఎన్​ రామ్​ తెలిపారు. 'సీఏఏ ప్రధాని మోదీ మొదటి పదవీకాలంలో అమోదం పొందింది. కానీ కొన్ని కారణాల వల్ల సీఏఏ ఇటీవల అమల్లోకి వచ్చింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను గవర్నర్లను ఉపయోగించి కేంద్రం ఇబ్బందులు గురిచేసింది. ప్రస్తుతం కేంద్రానికి మద్దతు ఇచ్చిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్, బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సారి వారు తమ రాష్ట్రం, ప్రజల కోసం మరోసారి ప్రత్యేక హోదా డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో బీజేపీ మునుపటిలా ప్రభుత్వాన్ని నడపడం కష్టం. ముఖ్యంగా మోదీ, అమిత్ షా పాత పద్ధతిలో పనిచేయలేరు. జేడీఎస్ కూడా ఎన్​డీఏ భాగస్వామ్య పక్షమైనప్పటికీ బీజేపీ తెలుగుదేశం, జేడీయూకి ఇచ్చినంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు' అని వ్యాఖ్యానించారు.

'అంచనాలు తప్పిన ఎగ్జిట్ పోల్స్'
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వాస్తవికతకు దూరంగా ఉన్నాయని ఎన్ రామ్ అభిప్రాయపడ్డారు. అయినా కూడా చాలా మంది నిజాయితీ గల పాత్రికేయులు వాస్తవ పరిస్థితిని వెలుగులోకి తెచ్చారని పేర్కొన్నారు. ది హిందూ ఎడిటర్ సురేశ్ నంపత్ బీజేపీకి 250 లోపు సీట్లు వస్తాయని కచ్చితంగా అంచనా వేశారని చెప్పుకొచ్చారు.

మోదీకి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదు!
ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్రంలో కానీ, గుజరాత్‌లో కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం లేదని ఎన్ రామ్ పేర్కొన్నారు. ఎందుకంటే మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బీజేపీ అఖండ విజయాన్ని అందుకునేదని చెప్పుకొచ్చారు. 'సంఘ్‌ పరివార్‌ అండతో అటల్‌ బిహారీ వాజ్‌ పేయీ ప్రధాని అయ్యారు. ఆయన చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. బీజేపీ మేనిఫెస్టోను పరిశీలిస్తే రామమందిరం అంశం ఎప్పుడూ ఉండేది కాదు. మొట్టమొదటి రామమందిర అంశాన్ని తీసుకొచ్చింది ఎల్​కే అడ్వాణీ. కానీ అప్పటి ఎన్​డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఈ అంశాన్ని వ్యతిరేకించాయి' అని ఎన్ రామ్ వ్యాఖ్యానించారు.

"చంద్రబాబు నాయుడు నాకు బాగా తెలుసు. ఆయన విశ్వసనీయత కలిగిన నేత. ఆంధ్రప్రదేశ్​లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీని విజయ పథంలో నడిపించారు. ఎన్​డీఏ నుంచి ఆయన ఈ సారి బయటకు వెళ్లరని భావిస్తున్నా. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాని మోదీ చరిష్మా కాస్త తగ్గింది. బీజేపీ ఓట్ షేర్ కూడా గతంతో పోలిస్తే ఈసారి తగ్గింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ 40 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. కానీ తగ్గాయి. ప్రత్యర్థులను శత్రువులు, దేశద్రోహులుగానో చూపించలేమని బీజేపీ ఇకనుంచి గ్రహించాలి. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు కాస్త రాజీ పడాల్సి ఉంటుంది" అని సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ తెలిపారు.

పార్లమెంట్ సమావేశాల తొలి సెషన్ షెడ్యూల్ ఫిక్స్- గడ్కరీ, నిర్మల ఆన్ డ్యూటీ! - Parliament Sessions

రెచ్చిపోయిన ఉగ్రవాదులు- CRPF జవాన్ మృతి, ఆరుగురికి గాయాలు- 72గంటల్లో మూడోసారి! - Jammu Kashmir Terror Attacks

ABOUT THE AUTHOR

...view details