SC ST Sub Classification :ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పాలసీలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టే అధికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై విచారణ జరుపుతున్న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ మేరకు కేంద్రం తరఫున బుధవారం వాదనలు వినిపించారు. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని తుషార్ మెహతా చెప్పారు. రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
"ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లకు మన రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పిస్తోంది. వెనుకబడిన వర్గాల్లోని పైస్థాయిలో ఉన్న వారు ఈ రిజర్వేషన్ ప్రయోజనాలను గరిష్ఠంగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. సమాన అవకాశాలు రెండు రకాలుగా పని చేస్తాయి. ఓపెన్ కేటగిరీకి, వెనుకబడిన వర్గాలకు వర్తించే సమాన అవకాశాలు ఒకటైతే- వెనుకబడిన వర్గాల్లో కూడా సమాన అవకాశాలు ఉండాలి. వర్గీకరణ లేకపోతే రిజర్వుడ్ కేటగిరీలలో అసమానతలు ఏర్పడతాయి. వర్గీకరణ అవకాశం లేకపోతే సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాలను నిలువరించినట్లు అవుతుంది."
-తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
'రిజర్వేషన్లు పరిమితం- హేతుబద్ధత అవసరం'
రిజర్వేషన్ ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయని తుషార్ మెహతా గుర్తు చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఉండే రిజర్వేషన్ సీట్లు అరుదైన వస్తువుల వంటివని, వాటిని హేతుబద్ధంగా పంపిణీ చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. అసలైన లక్ష్యం నెరవేరేలా వీటిని పంపిణీ చేయడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.