Sarabjit Singh Contesting In Punjab LS Polls 2024 :మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ సింగ్ ఖల్సా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
45 ఏళ్ల సరబ్‌జీత్ గతంలో పలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో సరబ్‌జీత్‌కు 1,13,490 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2007లో జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో భదౌర్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో సరబ్‌జీత్‌కు 15 వేలకుపైగా ఓట్లు దక్కాయి. 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ బఠిండా, ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఈ రెండు ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు రూ.3.5 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు సరబ్‌జీత్. ఇదిలాఉంటే ఈయన తల్లి బిమల్ కౌర్ ఖల్సా 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రోపర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి 4లక్షల ఓట్ల మెజరిటీతో గెలిచారు. ఇవే ఎన్నికల్లో ఆయన తాత, బియాంత్ సింగ్ తండ్రి సుచాసింగ్ కూడా బఠిండా స్థానం నుంచి విజయం సాధించారు. ఈయనకు 3 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టారు.