Ratha Saptami 2024 Importance and Puja Vidhanam : భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని, ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవంగా పేర్కొంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథి నాడు జరుపుకునే రథ సప్తమి(Ratha Saptami 2024) మరింత విశేషమైనదని చెబుతారు. ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం వైపు ప్రయాణం సాగిస్తాడు. అందుకే మాఘ సప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలూ ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెబుతారు. అందుకే ఎంతో పవిత్రమైన రథ సప్తమి రోజున భక్తులు వేకువ జామునే లేచి నదీ స్నానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది? శుభ సమయం ఎప్పుడు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఆ రోజు సూర్యుడిని ఎలా పూజించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథసప్తమి తేదీ, శుభ సమయమిదే :హిందూ ధర్మంలో రథ సప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. మాఘ మాస శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 15 గురువారం ఉదయం 10.12 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 16 శుక్రవారం నాడు 8:54 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం 16వ తేదీ శుక్రవారం నాడు రథ సప్తమిని జరుపుకుంటారు. ఈ టైమ్లో ఉపవాస దీక్షలు, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
రథసప్తమి ప్రాముఖ్యత :హిందూ పురాణాల ప్రకారం, కశ్యప మహర్షి, అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టిన రోజునే రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకుని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుడిని పూజించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, ఆర్థిక పరమైన రంగాల్లో మంచి లాభాలొస్తాయని, ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే రథ సప్తమి రోజు సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.