Rameswaram Cafe Blast Update :కర్ణాటక బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుళ్ల కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారిని విచారిస్తున్నట్లు పేర్కొన్నాయి. పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని బెంగళూరు నగర కమిషనర్ బీ దయానంద తెలిపారు. ఈ కేసుపై పోలీసులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపడుతున్నారని చెప్పారు. కేసు సున్నితత్వం, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరారు. మరోవైపు, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.
'నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటాం'
రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడుకు కారణమైన నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. సీసీటీవీ ఆధారంగా ఘటన వెనుక ఉన్న వారిని పట్టుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే పేలుడు సంభవించిన రామేశ్వరం కేఫ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం సందర్శించారు. ఆ తర్వాత పేలుడు ఘటనలో గాయపడి బ్రూక్‌ఫీల్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
"రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనలో నిందితుడి కదలికలు సీసీ కెమెరాలకు చిక్కాయి. పేలుడు కారణమైనవారిని పట్టుకుంటాం. ఫేస్ మాస్క్, క్యాప్ ధరించిన ఒక వ్యక్తి బస్సులో వచ్చి కేఫ్‌కు వచ్చాడు. టిఫిన్‌ను ఆర్డర్ చేసి కేఫ్‌లో ఒక చోట కూర్చున్నాడు. ఆ తర్వాత బ్యాగ్ అక్కడే ఉంచి వెళ్లిపోయాడు. పేలుడు ఘటనలో గాయపడ్డవారు క్షేమంగా ఉన్నారు. కేఫ్‌లో పేలుడుపై బీజేపీ రాజకీయాలు చేస్తోంది."
--సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి