Ram Mandir Construction Status :అయోధ్యలో రామాలయ సముదాయ నిర్మాణం 2024 డిసెంబరు నాటికి పూర్తవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. ప్రస్తుతం 1,500 మంది కార్మికులు ఆలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారని, త్వరలో మరో 3,500 మందిని అదనంగా నియమించుకోనున్నట్లు ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్ర వివరించారు. ఇటీవల జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయించిందని, కార్మికుల సంఖ్య పెంపుతో ఆలయంపై రెండు అంతస్తుల పనులను వేగవంతం చేస్తామన్నారు.
గర్భగుడి ఉన్న మొదటి అంతస్తు నిర్మాణం గతేడాది డిసెంబరు నాటికే పూర్తయింది. మొత్తం ఆలయంలో అయిదు శిఖరాలు ఉంటాయని, 161 అడుగుల ఎత్తుతో ఉండే ప్రధాన శిఖరానికి బంగారు తాపడం చేస్తామన్నారు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్ర. వర్షాకాలం మొదలయ్యేలోపు ప్రహరీ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రామాలయం కింది అంతస్తులో గర్భగుడి ఉందని, మొదటి ఫ్లోర్లో రామయ్య ఆస్థానాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రామ్‌లల్లాను దర్శించుకున్న తర్వాత భక్తులు ఆస్థానాన్ని సందర్శించవచ్చని చెప్పారు. ఆలయ ప్రధాన గోపురం, మరో గోపుర పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరో 300 రోజుల్లో ఆలయ శిఖరాలు సిద్ధమవుతాయని వెల్లడించారు. ఆలయ కాంప్లెక్స్ ప్రహరీ వెంబడి ఆరుగురు దేవుళ్లు, ఏడుగురు మహర్షుల ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు.
75లక్షల మంది దర్శనం
జనవరి 22న జరిగిన రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇప్పటిదాకా దాదాపు 75 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకొన్నట్లు అధికారులు తెలిపారు. మంగళ, శని, ఆదివారాల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్య రామయ్యను దర్శించుకుంటున్నారని చెప్పారు. మిగతా రోజుల్లో దాదాపు 1.5 లక్షల మంది భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు.