Ram Lalla Surya Tilak :శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.
సూర్యతిలకం కోసం ఏర్పాట్లు ఇలా
మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.