VRS For Wife - Kota Viral Video : రాజస్థాన్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బాగోగులు చూసుకునేందుకు ఓ భర్త ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ రిటైర్మెంట్) తీసుకున్నారు. తదుపరి కాలాన్ని ఆమెతో గడపాలని భావించారు. కానీ పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లోనే అతని భార్య మృతిచెందడం అందరినీ కలిచివేస్తోంది.
భార్య కోసం VRS తీసుకున్న ఉద్యోగి - రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే ఆమె మృతి! - VRS FOR WIFE
అనారోగ్యంతో బాధపడుతున్న సతీమణి కోసం వీఆర్‌ఎస్ తీసుకున్న భర్త - రిటైర్మెంట్ ఫంక్షన్‌లోనే ఆమె మృతి - వీడియో వైరల్
Published : Dec 25, 2024, 8:44 PM IST
రాజస్థాన్‌లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య దీపిక గృహిణి. కొంత కాలంగా ఆమె గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వారికి సంతానం కూడా లేదు. దీనితో భార్య బాగోగులు చూసుకోవాలని భావించిన దేవేంద్ర, మూడేళ్ల ముందుగానే తన ఉద్యోగానికి రిజైన్ చేశారు. దీనితో తోటి ఉద్యోగులు రిటైర్మెంట్ ఫంక్షన్‌ను ఆఫీసులోనే నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అతని భార్య దీపికను కూడా తీసుకెళ్లారు.
దేవేంద్ర దంపతులను కుర్చీలో కూర్చోబెట్టిన ఉద్యోగులు, వారిని పూలమాలలతో సత్కరించారు. ఒక్కొక్కరుగా ఫొటోలు కూడా దిగారు. ఈ సత్కార కార్యక్రమంగా సరదాగా సాగుతుండగానే దీపిక కుర్చీలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో దేవేంద్రతోపాటు వారి సన్నిహితుల్లో తీవ్ర విషాదం నెలకొంది.