Rahul Gandhi On Reservation : 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని వెల్లడించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఝార్ఖండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సైకిల్‌పై బొగ్గు తీసుకెళుతున్న యువకులతో కాసేపు ముచ్చటించారు.
ఆదివాసీలకు, దళితులకు కల్పించే రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 'దేశంలో వెనకబడిన కులాల వారు తప్పనిసరిగా తమ హక్కులు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు, ఆసుపత్రులు, పాఠశాలల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించారు. అంతేకాకుండా వారిని కార్మికులుగా మార్చారు. ఇది సామాజిక, ఆర్థికపరమైన సమస్య. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయడం సహా దేశవ్యాప్తంగా కులగణన చేపడతాం' అని రాహుల్ చెప్పారు. ఎన్నికల సమయంలో మాత్రమే మోదీకి ఓబీసీ అనే విషయం గుర్తొస్తుందని విమర్శించారు. కులగణన కోరిన ప్రతిసారీ దేశంలో ఉన్నది ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమేనని చెబుతారని ఆరోపించారు.
'అందుకే ఇండియా కూటమి ఏర్పాటు'
ఝార్ఖండ్ అసెంబ్లీలో చంపయీ సోరెన్ బలపరీక్షలో విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తంచేసిన రాహుల్, కాంగ్రెస్-జేఎమ్‌ఎమ్‌లు కలిసికట్టుగా ప్రభుత్వాన్ని కాపాడుకున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ధనం, దర్యాప్తు సంస్థల అండతో ప్రభుత్వాలను కూల్చేయాలనుకుంటోందని ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని రాహుల్ గాంధీ తెలిపారు.