Horrific Ragging Incident In Kerala :కేరళ కొట్టాయం నర్సింగ్ కళశాల ర్యాగింగ్ ఉదంతానికి సంబంధించిన దారుణమైన దృశ్యాలు గురువారం వెలుగులోకి వచ్చాయి. గాంధీనగర్ పోలీసులకు అందిన ఫుటేజీ ప్రకారం- ఓ విద్యార్థి బట్టలు అన్ని విప్పించి కదలకుండా మంచానికి కట్టేశారని పోలీసులు తెలిపారు. అనంతరం అతడి రహస్య అవయవాలపై డంబెల్స్‌ను ఉంచడం, నొప్పితో నోరు తెరిచినప్పుడు ఫేషియల్ క్రీమ్‌ను బలవంతంగా నోట్లో పోయడం, పదునైన వస్తువులతో గాయపరిచి, విపరీతమైన నొప్పి కలిగేలా గాయాలపై లోషన్ పోయడం వంటి వికృత చేష్టలను సీనియర్లు చేసినట్లు వెల్లడించారు.
స్థానిక టీవీల్లో ప్రసారం చేసిన దృశ్యాల్లో ఓ జూనియర్ విద్యార్థి - శరీరం అంతటా లోషన్‌తో మంచం మీద పడుకుని ఉన్నాడు. అతడి చేతులు, కాళ్లును తాడుతో కట్టారు. కదలలేని స్థితిలో నొప్పితో అతడి అరుస్తూ కనిపించాడు. అలా అరుస్తుండగా సీనియర్లు విద్యార్థి వివిధ భాగాలను కంపాస్‌తో గుచ్చారు. బిగ్గరగా "ఒకటి, రెండు, మూడు" అని లెక్కించారు. బాధితుడు నొప్పితో అరుస్తుండగా, నిందితులు ఆ జూనియర్ విద్యార్థిని ఎగతాళి చేశారు. ఈ దృశ్యాలను మూడో ఏడాది విద్యార్థులు రికార్డ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.