Puri Srimandir Ratna Bhandar : నలభై ఆరు ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒడిశాలోని పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం రహస్య గది తెరుచుకోనుంది. దీన్ని ఈ నెల 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనితో రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. డుప్లికేట్ తాళం పని చేయకపోతే, తాళాన్ని పగులగొట్టి రత్నభాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు.
46 ఏళ్ల తర్వాత
ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుని ఆలయంలో ఉన్న రత్నభాండాగారం రహస్య గది జులై 14వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరిసారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. అప్పటి నుంచి మూసి ఉన్న రహస్యగదిని మళ్లీ జులై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరీలో జరిగిన కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
జులై 14వ తేదీలోగా రత్నభాండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాన్ని, కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళం పని చేయకపోతే, తాళాన్ని పగులగొట్టి రత్నభాండాగారం ఉన్న రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు. పూరీ జగన్నాథుని రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రత్నభాండాగారం రహస్య గది తాళం చెవి ఇది వరకు కనిపించకుండాపోయిన నేపథ్యంలో డూప్లికేట్ తాళంచెవి పూరీ కలెక్టరేట్‌లోని ఖజానాలో ఉందని శ్రీక్షేత్ర పాలనాధికారి చెప్పారు.
దశాబ్దాలుగా రహస్యగదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు, వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, గోమేధిక, పుష్యరాగాల బరువు, నాణ్యత తమ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఈ సంపద పరిశీలించడానికి నిపుణుల అవసరం ఉన్నందున మరో సంఘం నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. సంఘం ఏర్పాటు చేసే బాధ్యత శ్రీక్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందన్నారు.