Pune Porsche Case Minor Mother Arrested :పుణెలో ఓ మైనర్ మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపి ఇద్దరు టెకీల మృతికి కారణమైన కేసులో బాలుడి తల్లిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఘటనా సమయంలో బాలుడి రక్తంలో మద్యం ఉందా లేదా అన్న పరీక్ష నిర్వహించే సమయంలో ఆమె తన రక్తాన్ని ల్యాబ్‌కు పంపిందని పోలీసులు నిర్ధరించారు. అందుకే తొలిసారి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బాలుడి రక్తంలో ఆల్కహాల్ లేదన్న ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. ఆమె తన కుమారుడిని కేసు నుంచి బయటపడేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ నిర్వాకానికి ఒడిగట్టినట్లు వివరించారు.
బ్లడ్ శాంపిళ్లు మార్చేందుకు భారీ డీల్
ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇదివరకు వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే బాలుడి తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్‌కు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అయితే రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె, తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకున్నారు.
అధికారులను ప్రలోభపెట్టే ప్రయత్నం
సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయ్యారు. ఈ కేసును తన మీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడం వల్ల కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించిందని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.