Halt Spot Booking At Sabarimala : శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులు స్పాట్ బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని నిలిపివేస్తూ కేరళ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తీర్థయాత్రల సీజన్లో భక్తులకు అంతరాయం కలగకుండా స్పాట్ బుకింగ్‌లను పునరుద్ధరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాగే అధికార పార్టీ సీపీఎం మిత్రపక్షాలు కూడా స్పాట్ బుకింగ్స్‌పై ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతున్నాయి.
'ఆర్ఎస్ఎస్కు అవకాశం ఇవ్వద్దు'
శబరిమలలో అయ్యప్ప భక్తుల కోసం ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ విధానంతో పాటు స్పాట్ బుకింగ్స్‌ను తిరిగి తీసుకురావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిస్థితిని రాజకీయ లబ్ది కోసం ఆర్ఎస్ఎస్ ఉపయోగించుకోవడానికి వీలు కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. విశ్వాసం ముసుగులో భక్తులను తప్పుదోవ పట్టించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివాదాన్ని రెచ్చగొట్టడానికి చాలా మంది ప్రయత్నిస్తారని ఆయన అన్నారు. "వర్చువల్ బుకింగ్‌తో పాటు భక్తులందరి సౌకర్యార్థం స్పాట్ బుకింగ్‌ను కూడా ప్రభుత్వం తీసుకురావాలి. అయ్యప్ప భక్తులు దీక్షలు చేసి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే పరిస్థితి వస్తే ఆర్ఎస్ఎస్ దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది" అని బినోయ్ విశ్వం విమర్శించారు.
'స్పాట్ బుకింగ్‌లను మళ్లీ తీసుకురావాలి'
స్పాట్ బుకింగ్ రద్దును పునఃపరిశీలించారని కోరుతూ సీఎం పినరయి విజయన్, దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్కు ఇటీవలే కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ లేఖ రాశారు. ఆన్లైన్ బుకింగ్‌పై ప్రత్యేకంగా ఆధారపడటం వల్ల యాత్రికులు, ప్రత్యేకించి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, సాంకేతికత గురించి తెలియని వారు తీవ్ర ఇబ్బందులు పడతారని లేఖలో పేర్కొన్నారు.