Jammu Kashmir Elections 2024 :జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు అయిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. తన నివాసంలో రాహుల్ గాంధీ, హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో గురువారం సమావేశమైన అనంతరం పొత్తు విషయాన్ని వెల్లడించారు. విపక్ష ఇండియా కూటమి మంచి ట్రాక్‌లో ఉందని తెలిపారు. దేశంలోని విభజన శక్తులను ఓడించేందుకు నేషనల్ కాంగ్రెస్- కాంగ్రెస్ ఉమ్మడిగా పోరాడతాయని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
అంతకుముందు శ్రీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలను మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఆ సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడమే కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ప్రాధాన్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది ఎన్నికలకు ముందే జరుగుతుందని ఊహించామని, కానీ ఎలక్షన్ కోడ్ విడుదలైందని అన్నారు. జమ్ముకశ్మీర్ ప్రజలతో తనకు చాలా అనుబంధముందని తెలిపారు.
'ఇది ఒక ముందడుగు'
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించడం ఒక ముందడుగు అని రాహుల్ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో జమ్ముకశ్మీర్ ప్రజల హక్కుల పునరుద్ధరణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సాయం అందించడంలో ప్రజలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో గడ్డు కాలముందన్న రాహుల్, దానిని తాము అర్థంచేసుకుని, హింసను తొలగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. సోదరభావంతో ప్రేమ దుకాణాన్ని తెరవాలని కోరుకుంటున్నట్లు రాహుల్‌గాంధీ మరోసారి చెప్పారు.